Tilak Varma : దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత తిలక్ వర్మ ఫామ్‌పై మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీని చూసి నేర్చుకోవాలనీ, సహజ సిద్ధమైన ఆట తీరును మార్చుకోవద్దని సూచించారు. అసలు తిలక్ వర్మకు ఏమైంది?
ఎందుకు తిలక్ వర్మ విఫలమవుతున్నాడు? ఛేజ్ మాస్టర్ కావాలంటే అది ఉండాలి
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 పోరులో టీమ్ ఇండియా పరాజయం పాలవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత బ్యాటింగ్ లైనప్ వైఫల్యం అభిమానులను నిరాశకు గురిచేసింది. 1 నుంచి 8వ నంబర్ వరకు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వరుసగా విఫలమవ్వడం చర్చనీయాంశంగా మారింది. తిలక్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అతడికి ఒక ప్రత్యేకమైన గురుమంత్రాన్ని అందించారు.
26
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. సూర్యపై ట్రోల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడిన తీరు అతివిశ్వాసంగా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జట్టు ఓటమికి బాధ్యత వహించాల్సింది పోయి, బడాయి మాటలు చెబుతున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, జట్టులో సమన్వయం లోపించిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
36
తిలక్ వర్మకు కైఫ్ ప్రత్యేక సలహా
యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆటతీరుపై మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ లో విశ్లేషించారు. తిలక్ ఎదుర్కొంటున్న అసలు సమస్య భారీ షాట్లు ఆడలేకపోవడం కాదని, బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేయలేకపోవడమేనని కైఫ్ స్పష్టం చేశారు. బయట వినిపించే విమర్శలను పట్టించుకోకుండా, తన సహజ సిద్ధమైన ఆటపై దృష్టి సారించాలని సూచించారు. క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను నిర్మించే అలవాటు చేసుకోవాలని, అప్పుడే పాత ఫామ్ తిరిగి వస్తుందని కైఫ్ అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్‌లో నిలకడ సాధించాలంటే విరాట్ కోహ్లీని రోల్ మోడల్‌గా తీసుకోవాలని తిలక్ వర్మకు కైఫ్ సూచించారు. "తిలక్.. నీవు కోహ్లీ లాగా ఆడటం నేర్చుకోవాలి. ఇతరులు చెబుతున్నారని నీ సహజమైన ఆటను మార్చుకుని, భారీ షాట్ల కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకోవద్దు. అలా చేస్తే నీవు ఎప్పటికీ మెరుగైన ఆటగాడివి కాలేవు. నీ ఆలోచనలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయి. గొప్ప ఛేజ్ మాస్టర్ కావాలంటే ముందుగా 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడటం నేర్చుకోవాలి" అని కైఫ్ అన్నారు.
56
మేనేజ్‌మెంట్‌దే అసలు బాధ్యత
ఆటగాళ్ల వైఫల్యంలో టీమ్ మేనేజ్‌మెంట్ పాత్ర కూడా ఉంటుందని కైఫ్ అభిప్రాయపడ్డారు. "స్ట్రైక్ రేట్ పెంచాలనే ఒత్తిడిలో తిలక్ అవుట్ అవుతున్నాడు. మేనేజ్‌మెంట్ చెప్పినట్లు చేయడం ఆటగాడి బాధ్యత, కానీ ఆటగాడికి తన నేచురల్ గేమ్ ఆడే స్వేచ్ఛను ఇవ్వడం మేనేజ్‌మెంట్ బాధ్యత. తిలక్ తన సొంత శైలిలో ఆడితే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే అతను మ్యాచ్‌ను ముగించగలడు. బలవంతంగా వేగంగా ఆడమని ఒత్తిడి చేయడం వల్లే అతను విఫలమవుతున్నాడు" అని కైఫ్ విశ్లేషించారు.
66
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో స్ట్రైక్ రేట్ 118గా ఉంది. టీమ్ ఇండియా భారీ ఆశలు పెట్టుకున్న ఈ యువ ఆటగాడు కీలక దశలో విఫలమవ్వడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. కైఫ్ ఇచ్చిన ఈ సలహాలను పాటించి తిలక్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో పుంజుకుంటాడో లేదో వేచి చూడాలి. అయితే, రాబోయే మ్యాచ్ లలో తిలక్ ను జట్టు నుంచి తప్పించే అవకాశముందని కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీని కోసం టీమిండియా మరో ప్లాన్ ను కూడా సిద్ధం చేసిందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.