ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలిచిన లక్ష్య సేన్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Published : Nov 23, 2025, 11:28 PM IST

Lakshya Sen: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో యుషి తనాకాను ఓడించి లక్ష్య సేన్ మూడో సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 38 నిమిషాల్లోనే ఆధిపత్య విజయంతో సత్తా చాటాడు.

PREV
13
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లక్ష్య సేన్

Lakshya Sen: భారత బ్యాడ్మింటన్‌కు మరొక గర్వకారణంగా నిలుస్తూ, యంగ్ స్టార్ లక్ష్య సేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్నాడు. సిడ్నీలో జరిగిన ఈ ఫైనల్లో జపాన్ క్రీడాకారుడు యుషి తనాకాపై సేన్ తన ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించేసి, 21-15, 21-11 తేడాతో విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి చేసిన నెట్ తప్పిదాలు, షాట్లను తెలివిగా ఉపయోగించుకున్న సేన్.. తన ఆటలో వేగం, నియంత్రణ, ధైర్యాన్ని చూపిస్తూ సత్తా చాటాడు.

మొదటి గేమ్‌లో 15-13 వద్ద తనాకా కొంత పోటీ ఇచ్చినప్పటికీ, సేన్ అక్కడినుంచి పూర్తిగా మ్యాచ్‌పై పట్టు సాధించాడు. రెండో గేమ్‌లో మరింత దూకుడుతో ఆడి, పవరుఫుల్ డ్రైవ్స్, ఫ్లాట్ రిటర్న్స్, అద్భుత ప్లేస్‌మెంట్‌తో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్నాడు. చివరగా చేసిన పదునైన క్రాస్ రిటర్న్‌తో ట్రోఫీని సీల్ చేశాడు.

23
పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశ

పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, గత కొన్ని నెలలుగా లక్ష్య సేన్‌పై ఒత్తిడి పెరిగింది. హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం, జపాన్ మాస్టర్స్‌లో సెమీఫైనల్‌లో నిష్క్రమించడం, హైలొ ఓపెన్‌లో క్వార్టర్స్ దాటలేకపోవడం.. ఇలా అతను చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు ముందు జరిగిన సెమీ ఫైనల్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ తిన్ చెన్‌ను 17-21, 24-22, 21-16 తేడాతో ఓడించి సేన్ తిరిగి తన సత్తా చూపించాడు. మూడు గేముల పోరులో అద్భుతంగా పుంజుకుని ఫైనల్ బెర్త్ కొట్టేసిన సేన్.. టైటిల్ మ్యాచ్‌లోనూ ఏ అవకాశమూ వదల్లేదు.

విజయం అనంతరం చేసిన ‘ఫింగర్స్ ఇన్ ఇయర్స్’ సెలబ్రేషన్.. గత కొన్ని వారాలగా ఎదుర్కొన్న ఒత్తిడి, విమర్శలకు ఇది తగిన సమాధానమని అభిమానులు భావిస్తున్నారు. ఫైనల్ అనంతరం కోచ్ యూ యాంగ్ సుంగ్, తండ్రి డీ.కే. సేన్‌లతో కలిసి సంబరాలు జరుపుకున్నప్పటి ఆనందభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

33
భారత బ్యాడ్మింటన్‌కు ఉజ్వల భవిష్యత్తు

మాజీ షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా సేన్ విజయంపై ప్రశంసలు కురిపించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత సేన్ చూపిస్తున్న నిలకడ, పట్టుదల భారత బ్యాడ్మింటన్‌కు మంచి సంకేతమని కశ్యప్ అభిప్రాయపడ్డాడు. “ఈ విజయం సీజన్ చివర్లో రావడం గొప్ప విషయం. భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం మిక్స్‌డ్ డబుల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్ అన్ని విభాగాల్లోనూ కొత్త ప్రతిభ రాబోతోంది. భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తోంది” అని ఆయన పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయం సేన్‌కు ఈ సీజన్‌లో తొలి టైటిల్ మాత్రమే కాకుండా.. కెరీర్‌లో మూడో సూపర్ 500 ట్రోఫీ. ఈ ఘనతతో సేన్, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన మూడో భారతీయ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

Read more Photos on
click me!

Recommended Stories