Vaibhav Suryavanshi: ఆసియా కప్ సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై విమర్శలు రాగా, కెప్టెన్ జితేష్ శర్మ దీనిపై స్పందించారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టీ20 టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఓవర్ లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ చివరకు బంగ్లాదేశ్ వశమైంది.
25
మ్యాచ్ జరిగింది ఇలా..
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 194 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 194 పరుగులే చేసి మ్యాచ్ ను టైగా ముగించింది. దీంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ సూపర్ ఓవర్ లో భారత కెప్టెన్ జితేష్ శర్మ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలను సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపకుండా, జితేష్ శర్మ, రమన్‌దీప్ సింగ్, ఆశుతోష్ శర్మలు బరిలోకి దిగారు.
35
సూపర్ ఓవర్ లో ఓటమి..
సూపర్ ఓవర్ లో వరుసగా రెండు బంతుల్లోనే జితేష్ శర్మ, ఆశుతోష్ శర్మలు అవుటవ్వడంతో భారత జట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆలౌట్ అయింది. రూల్స్ ప్రకారం, సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోతే ఆ జట్టు ఆలౌట్ అయినట్లు పరిగణిస్తారు. అనంతరం, బంగ్లాదేశ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ, రెండో బంతిని సుయాష్ శర్మ వైడ్ వేయడంతో విజయం లాంఛనమైంది. ఈ ఫలితంతో భారత జట్టు ఫైనల్ చేరకుండానే టోర్ని నుంచి నిష్కమించింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ జితేష్ శర్మ తన జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, తప్పుడు నిర్ణయాల కారణంగానే భారత జట్టు ఫైనల్ కు చేరలేకపోయిందని అంగీకరించాడు. వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్ లో ఆడించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా వివరించాడు.
55
వైభవ్ ను పక్కన పెట్టడంపై విమర్శలు
"మా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య పవర్‌ప్లే ఆడడంలో మాస్టర్లు. డెత్ ఓవర్లలో నాతోపాటు ఆశుతోష్ శర్మ, రమన్‌దీప్ సింగ్‌లు భారీ షాట్లు ఆడగలరు. ఈ క్రమంలోనే సూపర్ ఓవర్ లైనప్ ను జట్టుగా నిర్ణయించాం. కానీ ఎవరిని ఆడించాలి అనే తుది నిర్ణయం మాత్రం నేను తీసుకున్నానని" జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ, టోర్నీలో నిలకడగా రాణించిన వైభవ్ వంటి బ్యాటర్ ను కీలక సమయంలో పక్కన పెట్టడంపై క్రీడాభిమానుల నుంచి, విశ్లేషకుల వరకు అందరి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిని ఆడించి ఉంటే భారత్ గెలిచేదని అభిప్రాయం వ్యక్తమైంది.