కబడ్డీ వరల్డ్ కప్‌ ఛాంపియన్ గా టీమిండియా.. దుమ్మురేపుతున్న భారత మహిళలు

Published : Nov 24, 2025, 11:53 PM IST

Kabaddi World Cup: 2025లో భారత మహిళలు దుమ్మురేపుతున్నారు.  కబడ్డీ వరల్డ్ కప్‌లో చైనీస్ తైపీపై భారత్ అదిరిపోయే విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఈ ఏడాది నాలుగు ప్రపంచకప్పులు గెలుచుకుని రికార్డు సృష్టించారు.

PREV
14
ఢాకాలో దుమ్మురేపిన భారత మహిళలు.. కబడ్డీ వరల్డ్ కప్‌లో సూపర్ విక్టరీ

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 (Women’s Kabaddi World Cup 2025) ఫైనల్‌లో భారత్ 35-28 తేడాతో చైనీస్ తైపీపై ఘన విజయం సాధించింది. టోర్నమెంట్ మొత్తం అజేయంగా ముందుకు సాగిన టీమిండియా, కీలకమైన క్షణాల్లో ధైర్యంగా నిలిచి ప్రపంచకప్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.

పోటీ ప్రారంభం నుంచే భారత్ తన దూకుడును చూపించింది. మొదటి అర్ధభాగం ముగిసే సరికి 20-16 ఆధిక్యంలో నిలిచి, ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించింది. చివరి ఐదు నిమిషాలు మిగిలే సమయానికి భారత్ లీడ్‌ను 29-24కు చేర్చింది. తైపీ ఆటగాళ్లు ఎంతగా పోరాడినా, భారత్ ను దాటలేకపోయారు. చివరగా భారత్ 7 పాయింట్ల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఇరాన్‌పై 33-21 తేడాతో భారత్ విజయం సాధించగా, మరోవైపు చైనీస్ తైపీ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ఢాకా వరల్డ్ కప్‌తో కలిపి ఇప్పటి వరకు మహిళల కేటగిరీలో నిర్వహించిన రెండు వరల్డ్ కప్‌లను భారత్ గెలుచుకోవడం విశేషం.

24
2025లో వరుసగా నాలుగు ప్రపంచ టైటిల్స్

2025 సంవత్సరం భారత మహిళా క్రీడాకారిణులకు స్వర్ణయుగంగా మారింది. ఏడాది ప్రారంభం నుంచే టీమిండియా మహిళలు వరుస విజయాలతో ప్రపంచ క్రీడల్లో సత్తా చాటారు. ఈ ఏడాది మొత్తం నాలుగు ప్రధాన ప్రపంచకప్‌లు భారత్ మహిళలే గెలుచుకోవడం భారత క్రీడా చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.

34
అండర్-19 మహిళల ప్రపంచకప్: అద్భుత రికార్డు విజయం

ఈ ఏడాది ఆరంభంలోనే భారత U-19 మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత యువత అద్భుత ప్రతిభ చూపించింది. భవిష్యత్ భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లే శక్తి ఈ జట్టులో ఉందని ఈ విజయమే నిరూపించింది.

44
వన్డే మహిళల వరల్డ్ కప్, అంధుల టీ20 వరల్డ్ కప్

మహిళల 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ 2025లో కూడా భారత్ అదరగొట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమ్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ వంటి ఆటగాళ్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు.

అలాగే, మహిళల అంధుల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు నేపాల్‌ను చిత్తు చేసి టైటిల్‌ను దక్కించుకుంది. ఈ విజయం భారత మహిళల ప్రతిభా పరాకాష్టను మళ్లీ రుజువు చేసింది.

2025లో భారత మహిళలు గెలిచిన టైటిల్స్

• అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్

• ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్

• ఉమెన్స్ బ్లైండ్ టీ20 వరల్డ్ కప్

• ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్

Read more Photos on
click me!

Recommended Stories