
రాబోయే టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా భారత క్రికెట్ జట్టు తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగనున్న మెగా టోర్నీకి ముందు, భారత్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో చెరో 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి పోరులో అద్భుత విజయం సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 101 పరుగుల భారీ తేడాతో ప్రోటీస్ జట్టును చిత్తు చేసి, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో మ్యాచ్ లో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శనతో పాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఇదే తమ చివరి సన్నాహక సమయమని భావిస్తున్న భారత జట్టు, తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా రాణించి దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల నుండి కోలుకుని భారీ స్కోరు సాధించడం, ఆపై బౌలింగ్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం భారత జట్టు పటిష్ఠతకు నిదర్శనంగా నిలిచింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తాము టాస్ సమయంలో గెలుపు అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ అని భావించినప్పటికీ, మొదట బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దీనిపై సూర్యకుమార్ స్పందిస్తూ.. "మేము 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయాము. ఆ సమయంలో జట్టును ఆదుకోవడం చాలా ముఖ్యం. అక్కడి నుంచి 175 పరుగుల భారీ స్కోరుకు చేరుకోవడం సామాన్యమైన విషయం కాదు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఆడిన తీరు అద్భుతం. చివర్లో జితేష్ శర్మ తన పాత్రను పోషించాడు. అందరి కృషి వల్లే మేము గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగాము" అని పేర్కొన్నారు. ఓవర్లు 7 నుండి 15 వరకు దాదాపు 90-91 పరుగులు రావడం, చివరి ఐదు ఓవర్లలో 40-44 పరుగులు రాబట్టడం మ్యాచ్ గతిని మార్చేసిందని తెలిపాడు.
టీమిండియాలోని బ్యాటింగ్ డెప్త్ గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "జట్టులో 7-8 మంది నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పుడు, ప్రతీ మ్యాచ్‌లో అందరూ రాణించలేరు. ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే, మిగిలిన నలుగురు బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలి. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ రోజు వీరు ఆడారు, రేపు మరొకరు ఆడొచ్చు. టీ20 క్రికెట్ అంటేనే అలా ఉంటుంది. ఆటగాళ్లు ఎవరూ భయం లేకుండా, తమ సహజసిద్ధమైన ఆటను ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను" అని సూర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుత జట్టు ఫామ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ, సూర్య మారోసారి నిరాశపరిచాడు.
చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 28 బంతుల్లోనే అజేయంగా 59 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అయితే, పాండ్యా కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడంపై సూర్యకుమార్ స్పష్టత ఇచ్చారు.
"హార్దిక్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని వచ్చాడు. అతడు మళ్లీ గాయపడకూడదనే భయం నాకు ఉంది. అందుకే అతన్ని ఐదో బౌలర్‌గా మాత్రమే ఉపయోగించాను. అతని ఆరోగ్యం, ఫిట్‌నెస్ మాకు చాలా ముఖ్యం. అందుకే అతనిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము" అని కెప్టెన్ వివరించారు.
భారత బౌలింగ్ విభాగంపై కూడా సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కొత్త బంతితో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చేసిన దాడిని ఆయన మెచ్చుకున్నారు. "సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు, మా బౌలర్లు ఎలా స్పందిస్తారో చూడాలనుకున్నాను. అర్షదీప్, బుమ్రా కొత్త బంతితో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
వారిద్దరూ ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడానికి సరైన ఎంపిక అని నిరూపించుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మా బౌలర్లు చూపిన తెగువ, మాకున్న బౌలింగ్ వనరులు విజయంలో కీలక పాత్ర పోషించాయి" అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.