
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం రాంచీలోని JSCA స్టేడియం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా చేతిలో 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్‌లో పటిష్టమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తోంది.
రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గిల్ కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడి, గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. అలాగే, ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.
అయితే, భారత జట్టుకు భారీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే, దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీళ్లిద్దరూ ఆడనున్న తొలి వన్డే సిరీస్ ఇదే. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. దీంతో వారి దృష్టి అంతా 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఉంది. రాబోయే వన్డే సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేసి ప్రపంచకప్‌లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.
రాంచీలోని JSCA అంతర్జాతీయ స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుందని చెబుతారు. అంటే ఇక్కడ హై-స్కోరింగ్ గేమ్స్ చూసే అవకాశం తక్కువగా ఉంది. ఈ మైదానంలో పరుగుల వర్షం కురుస్తుందా లేక బౌలర్లు వికెట్ల పండుగ చేసుకుంటారా అనే చర్చ సాగుతోంది. అయితే, పిచ్ రికార్డులు గమనిస్తే, రాంచీ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 235గా ఉంది. అంటే లో స్కోరింగ్ మ్యాచ్ ను ఇక్కడ చూడవచ్చు.
అంటే బ్యాట్, బంతి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఆరంభంలో పిచ్ పేస్, బౌన్స్ అందించడం ద్వారా ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా అనుకూలిస్తుంది. కొత్త బంతితో బ్యాట్స్‌మెన్‌లు కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, మ్యాచ్ సాగుతున్న కొద్దీ, స్పిన్ బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్పిన్నర్లకు ఈ పిచ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంచనా.
రాంచీ మైదానంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే, ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. JSCA స్టేడియంలో ఇప్పటివరకు 9 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 5 మ్యాచ్‌లు గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దు అయింది.
సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 235 రన్సే అయినప్పటికీ, ఛేజ్ చేయడం ఇక్కడ సులువుగా ఉంటోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 2 మ్యాచ్‌లు గెలిస్తే, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్‌లు గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అధికంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కూడా వుండే అవకాశం ఉంది. మంచు వల్ల బంతి తడిగా మారి, బౌలింగ్‌కు కష్టంగా మారుతుంది. ఇది ఛేజింగ్ చేసే బ్యాట్స్‌మెన్‌లకు బాగా ఉపయోగపడుతుంది.
ఉత్తర భారతదేశంలో చలికాలం మొదలైంది. రాంచీలో కూడా వాతావరణం మార్పులు కనిస్తున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం రోజు కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటిపూట వాతావరణం వెచ్చగా ఉండి, సాయంత్రం వేళ చల్లగా మారనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం దాదాపు లేదు. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో క్రికెట్ అభిమానులు ఎటువంటి అంతరాయం లేకుండా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.
ఈ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉంది. సౌతాఫ్రికా పై ఈ ఇద్దరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పై 31 వన్డే మ్యాచ్‌లలో 65.39 సగటుతో 1,504 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ సౌతాఫ్రికా పై 26 వన్డే మ్యాచ్‌లలో 33.58 సగటుతో 806 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
భారత్, సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు 94 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సౌతాఫ్రికా 51 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ 40 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
సౌతాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, ఒట్నీల్ బార్ట్‌మాన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలాన్ సుబ్రాయన్.