2027 వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా? మోర్నీ మోర్కెల్ బిగ్ స్టేట్‌మెంట్

Published : Nov 29, 2025, 07:20 PM ISTUpdated : Nov 29, 2025, 07:26 PM IST

World Cup 2027 : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నానని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిట్‌నెస్ కాపాడుకుంటే వారికి చోటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

PREV
15
2027 వన్డే ప్రపంచకప్‌: కోహ్లీ, రోహిత్‌పై మోర్కెల్ కీలక వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల వన్డే ప్రపంచకప్ 2027లో ఈ ఇద్దరు దిగ్గజాలు కచ్చితంగా ఆడాలని మోర్కెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిద్దరి అనుభవం జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆస్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుండి కోహ్లీ, శర్మ భవిష్యత్తుపై చర్చ జరుగుతూనే ఉంది. గతేడాది ప్రపంచకప్ విజయం తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, 2027 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ప్రణాళికల్లో భాగమవుతారా లేదా అనే ప్రశ్నలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టుకు తీసుకువచ్చే విలువ, స్థిరత్వాన్ని మోర్కెల్ నొక్కి చెప్పారు.

మోర్కెల్ మాట్లాడుతూ.. "నిస్సందేహంగా, వారు నాణ్యమైన ఆటగాళ్లు. కఠోర శ్రమ చేయడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నంత వరకు జట్టులో కొనసాగవచ్చు. అలాంటి అమూల్యమైన అనుభవం మరెక్కడా దొరకదని నేను ఎప్పుడూ నమ్ముతాను. వారు ట్రోఫీలు గెలిచారు, పెద్ద టోర్నమెంట్‌లలో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు" అని అన్నారు. 

"రోహిత్, కోహ్లీ ఫిట్‌నెస్‌ను కొనసాగించగలిగితే, మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆడవచ్చు. ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది" అని మోర్కెల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సీనియర్ ఆటగాళ్లపై జట్టు కోచింగ్ స్టాఫ్‌కు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.

25
టెస్టు పరాజయం తర్వాత వన్డే సిరీస్ కు సిద్ధంగా భారత్

దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో ఎదురైన చారిత్రక ఓటమి నుంచి భారత జట్టు పుంజుకోవాలని చూస్తోంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వైఫల్యం తర్వాత, గువాహటిలో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. దీంతో 25 ఏళ్లలో భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను గెలవడం ఇదే తొలిసారి.

టెస్టు సిరీస్ ఓటమిపై మోర్కెల్ నిరాశ వ్యక్తం చేశారు. "గత రెండు వారాలు మాకు నిరాశను మిగిల్చాయి. అయితే, దాని గురించి ఆలోచించడానికి మాకు రెండు రోజులు సమయం దొరికింది. ఇప్పుడు మా దృష్టిని వైట్-బాల్ టీమ్ వైపు మళ్లించడం చాలా ముఖ్యం. మేము మంచి వైట్-బాల్ క్రికెట్ ఆడుతున్నాము. విరాట్, రోహిత్ తిరిగి రావడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రాబోయే వన్డే మ్యాచ్‌ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము" అని మోర్కెల్ తెలిపారు.

35
సెలక్షన్ ప్రక్రియలో భాగం కాదు: మోర్కెల్

దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో భారత్ 0-2తో ఓడిపోయిన నేపథ్యంలో, జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, తాను జట్టు ఎంపికలో పాల్గొనడం లేదని మోర్నీ మోర్కెల్ స్పష్టం చేశారు. రాంచీలో జరగనున్న తొలి వన్డేకు ముందు మాట్లాడిన మోర్కెల్, ఆటగాళ్ల ఎంపికకు సంబంధించిన నిర్ణయాలు ప్రధాన కోచ్, కెప్టెన్, సెలక్టర్లకే పరిమితమని నొక్కి చెప్పారు.

టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో పలువురు ఆల్‌రౌండర్లను చేర్చడంపై జట్టు యాజమాన్యం విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రకటన రావడం పై కొత్త చర్చ మొదలైంది. ఎక్కువ నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లను రంగంలోకి దించినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతలైన దక్షిణాఫ్రికా చేతిలో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది.

"నేను సెలక్షన్‌లో, సంబంధిత విషయాలలో నిజంగా పాల్గొనను. ఆ విషయాలను నేను గౌతమ్, సెలెక్టర్లు, కెప్టెన్‌కు వదిలివేస్తాను, కాబట్టి దానిపై నేను వ్యాఖ్యానించలేను" అని మోర్కెల్ శుక్రవారం రాంచీలో జరిగిన మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో అన్నారు.

45
శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాలపై అప్‌డేట్

మోర్నీ మోర్కెల్ భారత జట్టులోని ఇద్దరు కీలక బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. దీంతో, అతను రెండో టెస్టుతో పాటు రాబోయే వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. మరోవైపు, శ్రేయస్ అయ్యర్ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తీవ్ర గాయానికి గురై చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.

"దీనిపై వైద్య సిబ్బంది మాత్రమే సరైన వివరాలు ఇవ్వగలరు. నేను రెండు రోజుల క్రితం శుభ్‌మన్‌తో మాట్లాడాను. అతను బాగా కోలుకుంటున్నాడు. ఇది సంతోషించదగ్గ విషయం" అని మోర్కెల్ చెప్పారు. "శ్రేయస్ కూడా తన శిక్షణను ప్రారంభించాడు, ఇది గొప్ప విషయం. త్వరలోనే వారిద్దరిని తిరిగి జట్టులోకి వెల్ కమ్ చెప్పడానికి మేము ఎదురుచూస్తున్నాము. వారు ఆరోగ్యంగా ఉండటం, జట్టులోకి తిరిగి రావడానికి తమ సన్నద్ధతను ప్రారంభించడం శుభ పరిణామం" అని ఆయన తెలిపారు.

55
యువ పేసర్లపై మోర్కెల్ కామెంట్స్

రాంచీ పిచ్ పరిస్థితుల గురించి కూడా మోర్కెల్ మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని, కొంతవరకు దక్షిణాఫ్రికా వికెట్లను గుర్తుకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ పేసర్లపై మోర్కెల్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా బలమైన బ్యాటింగ్ లైనప్‌కు వ్యతిరేకంగా ఈ యువ పేసర్లు బాగా రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"హర్షిత్, ప్రసిద్ధ్, అర్షదీప్ ఇది ఒక గొప్ప అవకాశం. ఈ యువకులకు వీలైనంత ఎక్కువ మ్యాచ్ సమయం ఇవ్వడానికి మేము ఎప్పుడూ చూస్తుంటాము. వారు దూకుడుగా ఆడే క్రికెటర్లను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితులలో తమను తాము పరీక్షించుకోవడానికి ఇది వారికి మంచి అవకాశం. ఈ సిరీస్‌లో వారికి మంచి ఛాన్స్ లభిస్తుందని" మోర్కెల్ అన్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కానుంది. తర్వాతి మ్యాచ్‌లు డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో జరగనున్నాయి. వన్డే సిరీస్ తర్వాత, ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌పై దృష్టి సారిస్తామని తెలిపారు..

దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్.

Read more Photos on
click me!

Recommended Stories