358 పరుగులు చేసినా టీమిండియా ఎందుకు ఓడిపోయింది?

Published : Dec 03, 2025, 10:58 PM ISTUpdated : Dec 03, 2025, 11:02 PM IST

India vs South Africa: రాయ్‌పూర్ వన్డేలో 358 పరుగులు చేసినా భారత్ ఓటమి పాలైంది. చెత్త ఫీల్డింగ్‌, బౌలర్ల వైఫల్యం, కీలక క్యాచ్‌ల డ్రాప్‌తో మ్యాచ్ ను కోల్పోయింది. సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమికి పూర్తి కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
భారీ స్కోరు చేసినా టీమిండియా ఎందుకు ఓడింది?

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల ప్లేయర్లు పరుగుల వరద పారించారు. టీమిండియా 358 పరుగుల భారీ స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా ఆ లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో కేవలం 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఈ మ్యాచ్ ఫలితం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృథా కావడం మాత్రమే కాదు, భారత బౌలింగ్‌ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్‌, కీలక సందర్భాల్లో ప్రెషర్ హ్యాండ్లింగ్ లేకపోవడం వంటి అంశాలు భారత్ పతనానికి ముఖ్య కారణాలయ్యాయి.

టీమిండియా మొదటి మ్యాచ్ గెలిచిన ధీమాతో ఆడినట్లు మొత్తం గేమ్‌లో స్పష్టంగా కనిపించింది. మరోవైపు, ప్రోటీస్ జట్టు మొదటి వన్డేలో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని ప్రతిదశలోనూ మ్యాచ్ ను తమవైపు తీసుకెళ్లే ప్రణాళికలను అమలు చేసింది.

25
మ్యాచ్‌ను మార్చిన చెత్త ఫీల్డింగ్.. టీమిండియా పెద్ద తప్పిదం ఇదే

ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ చరిత్రలోనే అత్యంత పేలవంగా నిలిచింది. కనీసం 30 పరుగులు మిస్ ఫీల్డింగ్ వల్లే ఇచ్చేసింది. 2 సింపుల్ క్యాచ్ లను వదిలివేయడం కూడా మ్యాచ్ పై ప్రభావం చూపింది. బౌలర్లపై ఒత్తిడి తగ్గకుండా సౌతాఫ్రికా బ్యాటర్లు సులభంగా భారీ షాట్లు ఆడే పరిస్థితి కల్పించారు.

ఒకవైపు అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తే, మరోవైపు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ కీలక సమయంలో భారీగా రన్స్ సమర్పించుకోవడం భారత్ ను దెబ్బకొట్టింది. ఫీల్డర్లు కూడా తప్పులు చేయడంతో సౌతాఫ్రికాకు పరుగులు వచ్చాయి.

35
కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు పనిచేయలేదు !

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ప్రారంభంలో పిచ్ పరిస్థితులతో కాస్త ఆచితూచి ఆడాల్సిన అవసరం ఏర్పడింది. 62 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో కోహ్లీ, రుతురాజ్ జోడీ అద్భుత భాగస్వామ్యంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 

విరాట్ కోహ్లీ 102 (90 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగుల సెంచరీ నాక్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ 105 (83 బంతులు, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో తన తొలి వన్డే సెంచరీ బాదాడు. కేఎల్ రాహుల్ 66 నాటౌట్ పరుగులతో కెప్టెన్ నాక్ ఆడాడు.

భారత్ స్ట్రాటజీ ప్రకారం 350+ స్కోరు డిఫెండ్ చేయడానికి సరిపోతుందని భావించినా, బౌలర్లు ఆ అంచనాలను నిలబెట్టుకోలేకపోయారు.

45
మార్క్రామ్ సెంచరీ.. సౌతాఫ్రికా సూపర్ ఫైట్

358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆరంభం కీలకం. దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 8 పరుగులకు అవుట్ అయినా, ఐడెన్ మార్క్రామ్ దూకుడుగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఛేజింగ్ లో ప్రోటీస్ జట్టు అద్భుత ఆటతీరును కనబరిచింది. 

ఐడెన్ మార్క్రమ్ 110 (98 బంతులు, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగుల సెంచరీ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మాథ్యూ బ్రెట్జ్‌కే 68 పరుగులు, డెవాల్డ్ బ్రెవిస్ 54 పరుగులు, కార్బిన్ బోష్ 27 నాటౌట్ పరుగులతో మెరిశారు. భారత బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ప్రతి భాగస్వామ్యం మ్యాచ్‌ను భారత్ దూరం చేస్తూ వెళ్లింది.

55
రాయ్‌పూర్ లో టీమిండియా ఓటమికి కారణాలు గమనిస్తే..

టీమిండియా ఈ మ్యాచ్‌ను కోల్పోవడానికి ప్రధాన కారణాలు గమనిస్తే..

  • చెత్త ఫీల్డింగ్: కనీసం 25 నుంచి 30 పరుగులు అదనంగా ఇచ్చింది
  • బౌలర్ల వైఫల్యం: హర్షిత్ రాణా (70 రన్స్), ప్రసిద్ధ్ (85 రన్స్) కుల్దీప్ యాదవ్ (78 రన్స్) భారీగా పరుగులు ఇచ్చారు
  • ప్రెషర్‌లో తప్పిదాలు: ఒత్తిడి ప్రభావం ప్లేయర్ల పై స్పష్టంగా కనిపించింది.
  • డెత్ ఓవర్ల బౌలింగ్ బలహీనత
  • సౌతాఫ్రికా గత మ్యాచ్ లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవడం. అద్భుతమైన పోరాటం, షాట్ సెలక్షన్
  • పని చేయని స్పిన్ బౌలింగ్

ఈ తప్పిదాలను సరిదిద్దుకుంటేనే భారత్ సిరీస్ డిసైడర్‌లో గెలిచే అవకాశాలుంటాయి. కీలకమైన మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది. సిరీస్ ఎవరిదో ఆ మ్యాచ్‌లోనే తేలనుంది.

Read more Photos on
click me!

Recommended Stories