Glenn Maxwell: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2026 మినీ వేలానికి తన పేరును నమోదు చేసుకోలేదు. ఐపీఎల్ తన ఎదుగుదలకు తోడ్పడిందని మాక్స్‌వెల్ పేర్కొన్నప్పటికీ, క్రికెట్ విశ్లేషకులు మాత్రం అమ్ముడుపోననే భయంతోనే..
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకోలేదని సోషల్ మీడియాలో అతడు స్పష్టం చేశాడు. ఐపీఎల్ తనను ఒక క్రికెటర్‌గా తీర్చిదిద్దడానికి ఎంతగానో తోడ్పడిందని, ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం కల్పించిందని మాక్స్‌వెల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్ అభిమానుల ప్రేమకు వెలకట్టలేమని, తన కెరీర్‌లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
25
ఇక ఐపీఎల్‌కు రిటైర్మెంట్
ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి నేరుగా ప్రస్తావించకపోయినా, వేలానికి దూరంగా ఉండడం ద్వారా ఒక సంకేతం ఇచ్చాడు. 'ఐపీఎల్‌లో ఎన్నో మరపురాని సీజన్లు ఆడిన తర్వాత ఈ ఏడాది వేలంలో నా పేరును రిజిస్టర్ చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఈ లీగ్ నాకు ఇచ్చిన ప్రతిదానికి ఎంతో కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను' అని మాక్స్‌వెల్ తన మెసేజ్‌లో పేర్కొన్నాడు.
35
భావోద్వేగ పోస్ట్ వైరల్
ఐపీఎల్ తనకు అద్భుతమైన ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిందని, క్రికెట్ అంటే అభిరుచి గల అభిమానుల ముందు ఆడే అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లోని జ్ఞాపకాలు, సవాళ్లు, భారత అభిమానుల ఉత్సాహం తనతో శాశ్వతంగా ఉంటాయని అతడు అన్నాడు.
ఇప్పటికే ఆండ్రీ రసెల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమైన నేపథ్యంలో, తాజాగా ఈ జాబితాలో మాక్స్‌వెల్ చేరాడు. అయితే, వేలంలో అమ్ముడుపోననే గ్రహించి ఈ ముగ్గురు ఆటగాళ్లు మినీ ఆక్షన్‌కు దూరంగా ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన మాక్స్‌వెల్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా మొత్తం నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
55
మ్యాక్సీ గణాంకాలు
మాక్స్‌వెల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 141 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి, 23.88 సగటుతో 2819 పరుగులు సాధించాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తరఫున గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులే చేసిన మాక్స్‌వెల్.. ఆ బ్యాడ్ ఫామ్ కారణంగా పంజాబ్ అతన్ని వేలంలోకి వదిలేసింది. అతని కెరీర్లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, నిలకడలేమి ప్రదర్శన, ముఖ్యంగా గత సీజన్‌లోని గణాంకాలు ఈ నిర్ణయానికి ఒక కారణం అని నిపుణులు అంటున్నారు.