టీమిండియా అతిపెద్ద బలహీనత అదే !

Published : Nov 30, 2025, 03:01 PM IST

Team India : సౌతాఫ్రికా చేతిలో భారత్ టెస్టు సిరీస్ లో వైట్‌వాష్ అయింది. జట్టులో స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ లేకపోవడంపై హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ సుందర్‌ను మరింత ఉపయోగించుకోవాలని అన్నాడు. జట్టు ఎంపిక పై కూడా ప్రశ్నలు లేవనెత్తాడు.

PREV
15
టీమిండియా వైట్ వాష్ పై హర్భజన్ కామెంట్స్ వైరల్

భారత జట్టు సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన తర్వాత తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్డే సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్టు సిరీస్ లో భారత జట్టు ఆట తీరు గురించి మాట్లాడుతూ.. ఐదు రోజుల మ్యాచ్‌లకు భారత జట్టులో ఎటువంటి స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ లేకపోవడంపై ఆయన ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే భారత జట్టు అతిపెద్ద బలహీనతగా ఆయన అభివర్ణించారు.

25
వాషింగ్టన్ సుందర్‌పై భజ్జీ కామెంట్స్

సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత, భారత జట్టులో స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ లేకపోవడంపై భజ్జీ తన ఆందోళనను వ్యక్తంచేస్తూ.. వాషింగ్టన్ సుందర్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించాడు. తమిళనాడు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒక స్పెషలిస్ట్ రైట్-ఆర్మ్ ఆఫ్-స్పిన్నర్‌గా స్థిరపడటానికి మంచి ఎంపికగా పేర్కొన్నాడు. 

అలాగే, ఆల్‌రౌండ్ నైపుణ్యాల పరంగా మాజీ స్టార్ ప్లేయర్ ఆర్. అశ్విన్‌కు ప్రత్యామ్నాయంగా మారడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్ సుందర్‌కు మరింత ఎక్కువ ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

35
వారినే ఎక్కువగా బౌలింగ్ చేయించాలి

ఆర్. అశ్విన్ రిటైర్మెంట్ అయిన తర్వాత సేన (SENA) దేశాలతో జరిగిన తొలి దేశీయ సిరీస్‌లో భారత స్పిన్నర్లు సౌతాఫ్రికా ప్లేయర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. ఇదే విషయం పై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. "నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్నాడు. కానీ, మనం అతనితో ఎక్కువగా బౌలింగ్ చేయించాలి. అతన్ని బౌలర్‌గా తీర్చిదిద్దాలంటే, టెస్ట్ మ్యాచ్‌లలో అతనికి 30-35 ఓవర్లు వేయించాలి" అని అన్నారు. సుందర్‌ను జట్టులో కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేయకుండా, బౌలింగ్‌లో కూడా కీలక పాత్ర పోషించేలా సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

45
టర్నర్ పిచ్‌లపై ఆడటం మానుకోవాలి

భారత స్పిన్నర్లలో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన వారిలో మూడవ స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్.. భారత్ దేశీయ టెస్ట్ క్రికెట్‌లో టర్నింగ్ పిచ్‌లపై ఆడే అలవాటును వదులుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

"మనం ఆడుతున్న పిచ్‌లలో ఎవరినీ బౌలర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతీ బంతి స్పిన్ అవుతుంది లేదా కొన్ని బంతులు నేరుగా వెళ్తాయి" అని పేర్కొన్నారు. అంటే, అతిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ల వల్ల బౌలర్ల అసలు నైపుణ్యం బయటపడటం లేదని ఆయన అభిప్రాయం. ఇలాంటి పిచ్‌లపై ఆడటం వల్ల ఆటగాళ్ల అభివృద్ధి కూడా పెద్దగా ఉండదని అన్నారు.

55
టెస్ట్ క్రికెటర్ల ఎదుగుదల ఆగిపోయింది : భజ్జీ

ఒక బౌలర్ మంచి పిచ్‌లపై వికెట్లు తీసినప్పుడే అతన్ని మంచి బౌలర్‌గా పరిగణించవచ్చని హర్భజన్ అన్నారు. దేశంలో టెస్ట్ క్రికెటర్ల ఎదుగుదల ఆగిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి కారణం దేశీయ మైదానాల్లో టర్నింగ్ పిచ్‌లపై ఆడటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి, భారత్ మంచి పిచ్‌లను తయారు చేయడం ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, "మనం మంచి క్రికెట్ పిచ్‌లపై ఆడాలి. దశాబ్దానికి పైగా, భారత క్రికెట్ ను మొత్తం ఎదుగుదల లేని పిచ్‌లపై ఆడుతున్నాం. మీరు గమనిస్తే, మనం ఒకే చోట ఆగిపోయాం. మనం మంచి వికెట్లపై ఆడినప్పుడు అది అద్దంలో చూసుకున్నట్లుగా ఉంటుంది" అని అన్నారు.

ఇంగ్లాండ్‌లో భారత జట్టు బాగా రాణించిందని భజ్జీ గుర్తు చేశారు. "మనం భారత్ వెలుపల ఆడినప్పుడు, మన బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేసే అవకాశం లభిస్తుంది. కానీ, మీరు మీ బ్యాట్స్‌మెన్‌లకు స్వదేశంలో అవకాశం ఇవ్వకపోతే, వారు మ్యాచ్‌లు గెలవడం ఎలా సాధ్యమవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

అందుకే, భారత్ మంచి పిచ్‌లపై ఆడటం ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. ఒకవేళ భారత్ కోల్‌కతా వంటి వికెట్‌ను అందిస్తే, అది టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించడం గురించి మాట్లాడే పరిస్థితి ఉండదని అన్నారు. టెస్ట్ క్రికెట్ స్ఫూర్తిని నిలబెట్టాలంటే, బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమతుల్యం అందించే పిచ్‌లు అవసరమని అభిప్రాయపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories