Divya Deshmukh: భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచకప్ 2025 టైటిల్ గెలిచింది. ఫైనల్ పోరులో కోనేరు హంపీని ఓడించి తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
ప్రపంచ విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 విజేతగా భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నిలిచారు. ఆమె గెలుపు భారత దేశానికి గర్వకారణంగా మారింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో దివ్య దేశ్‌ముఖ్ అనుభవజ్ఞురాలైన భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీని రాపిడ్ టైబ్రేక్‌లో ఓడించింది. ఈ గెలుపుతో దివ్య ఫిడే ప్రపంచకప్‌ను గెలిచిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు సాధించారు.
25
అద్భుత టైబ్రేక్ తో దివ్య దేశ్‌ముఖ్ విజయం
మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియగా, ఫైనల్ విజేతను నిర్ణయించేందుకు రాపిడ్ టైబ్రేక్ నిర్వహించారు. రెండు రాపిడ్ గేమ్స్ 10 నిమిషాల సమయంతో ప్రతి కదలికపై 10 సెకన్ల ఇన్‌క్రిమెంట్‌తో జరిగాయి. మొదటి గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో హంపీ చేసిన పొరపాటును దివ్య చాకచక్యంగా ఉపయోగించుకొని విజయం సాధించింది. చివరికి 75వ ఎత్తులో హంపీ తగ్గాల్సి వచ్చింది.
35
చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్
ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్ కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. భారత్ నుండి ఇది సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్రలో నిలిచింది. అంతేకాదు, మహిళల ఫిడే చెస్ ప్రపంచకప్ గెలిచిన తొలి భారతీయురాలిగా దివ్య అరుదైన ఘనత అందుకుంది.
ఈ ఫైనల్ మ్యాచ్ మరింత విశేషం అని చెప్పాలి. ఫైనల్ లో తలపడింది ఇద్దరు భారతీయులే. ఫిడే మహిళల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇద్దరు భారతీయ మహిళా క్రీడాకారిణులు తలపడటం ఇదే మొదటిసారి. ఇది భారత చెస్ లోతైన అభివృద్ధికి ప్రతిబింబం. దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు ముందు సెమీఫైనల్‌లో చైనా మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీని ఓడించింది.
55
దివ్య దేశ్‌ముఖ్ కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుంది?
ఫిడే టైటిల్‌తో పాటు దివ్య $50,000 (రూ. 41 లక్షలు) ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంది. ఇప్పటికే 2020లో ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో దేశానికి గోల్డ్ మెడల్ అందించడంలో కీలకంగా వ్యవహరించిన దివ్య, 2021లో భారతదేశపు 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందింది. తాజా విజయం ఆమె కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. దివ్య దేశ్‌ముఖ్ అంకితభావం, నైపుణ్యం, ప్రామాణిక ఆటతీరు భారత యువతకు ఎంతో ప్రేరణగా నిలిచాయి.