RCB New Owner : ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం రూ. 16,706 కోట్లకు కొనుగోలు చేసింది.
RCB : ఆర్సీబీ కొత్త బాస్ వచ్చేశాడు.. IPL 2026 ముందే అదిరిపోయే న్యూస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ డీల్ ఒకటి జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగి జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలతో కూడిన ఒక కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ భారీ లావాదేవీ విలువ 1.78 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 16,706 కోట్లు) గా నిర్ణయించారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
26
ఆర్సీబీ 100 శాతం వాటా కొనుగోలు
యూకేకు చెందిన డయాజియో పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుండి ఆర్సీబీకి చెందిన 100 శాతం వాటాను ఈ కన్సార్టియం దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐపీఎల్‌లోని పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లోని మహిళా జట్టు కూడా కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. ఈ విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ డీల్‌లో కొనుగోలుదారుల తరపున A&W క్యాపిటల్, మోయిలిస్, ఖైతాన్ అండ్ కో సలహాదారులుగా వ్యవహరించారు.
36
ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా ఆర్యమాన్ బిర్లా
జట్టు యాజమాన్యం మారడంతో పాలక మండలిలోనూ మార్పులు వచ్చాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌నకు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కన్సార్టియంలో బోల్ట్ వెంచర్స్ వ్యవస్థాపకుడు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్‌స్టోన్ పీఈ స్ట్రాటజీ సీఈఓ వైరల్ పటేల్ కూడా కీలక భాగస్వాములుగా ఉన్నారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి బీసీసీఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావాల్సి ఉంది.
ఈ కొనుగోలుపై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పందిస్తూ.. "గత రెండు దశాబ్దాలుగా ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఒక శక్తిగా ఎదిగింది. భారతీయ క్రికెట్ రూపురేఖలను మార్చేసింది. ఆధునిక క్రీడల్లో ఆర్సీబీ ఒక అద్భుతమైన బ్రాండ్. ఈ ఆస్తికి సంరక్షకులుగా మారడం మాకు సంతోషంగా ఉంది. ఆర్సీబీ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం" అని పేర్కొన్నారు. కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా మాట్లాడుతూ.. క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాల పట్ల తమకు ఉన్న అవగాహన ఆర్సీబీ తదుపరి వృద్ధికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
56
ఆర్సీబీని ఎందుకు అమ్మాల్సి వచ్చింది?
ఆర్సీబీ జట్టును ప్రారంభంలో విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత యాజమాన్యం డయాజియో చేతుల్లోకి వెళ్లింది. అయితే, జూన్ 4, 2025న ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత, తమ కోర్ బిజినెస్ కాని క్రికెట్ ఫ్రాంచైజీ నుండి తప్పుకోవాలని డయాజియోపై ఒత్తిడి పెరిగింది. దీంతో గతేడాది నవంబర్‌లోనే జట్టును విక్రయించబోతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమాచారం అందించారు.
66
శనివారం నుండే ఆర్సీబీ కొత్త ప్రస్థానం
టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ చైర్మన్ సత్యన్ గజ్వానీ మాట్లాడుతూ.. "ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్. కర్ణాటక ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ జట్టును గ్లోబల్ స్పోర్టింగ్ ఇన్‌స్టిట్యూషన్‌గా మారుస్తాం" అని చెప్పారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఈ మార్పు జరిగింది. శనివారం జరగబోయే మ్యాచ్‌లో తమ టైటిల్‌ను కాపాడుకునేందుకు ఆర్సీబీ బరిలోకి దిగనుంది. కొత్త యజమానుల రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది