ఆచార్య చాణక్యుడు మానవ జీవితం గురించి ఎన్నో విషయాలు బోధించాడు. మనిషి నీతిగా, నిజాయతీగా ఎలా బతకాలో తన నీతుల్లో పేర్కొన్నాడు. కాకి నుంచి 5 విషయాలు నేర్చుకోవడం ద్వారా మనిషి.. సమాజంలో గౌరవంగా, విజయవంతంగా బతకొచ్చని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో వివరించాడు. మరి ఆ 5 అంశాలు ఏంటీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
చాణక్యుడి ప్రకారం కాకి నుంచి నేర్చుకోవాల్సి విషయాలు
ఆహారం దాచుకోవడం
కాకి తనకు దొరికిన ఆహారాన్ని ఒకేసారి తినకుండా కష్ట కాలం కోసం దాచుకుంటుందట. చాణక్యుడి నీతి ప్రకారం మనుషులు కూడా అలాగే కష్ట సమయం కోసం అవసరమైన వాటిని దాచుకోవాలట. దీనివల్ల కష్టకాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చాణక్య నీతి చెబుతోంది.
సమానంగా పంచుకొని తినడం
చాణక్యుడు కాకి లక్షణాల గురించి తన నీతి సూత్రాల్లో వివరించాడు. కాకి తనకు ఒక మెతుకు దొరికినా తన వాళ్లందరినీ పిలుస్తుందట. అందరితో సమానంగా పంచుకొని తింటుందట. మనిషి కూడా తనవాళ్లతో అలాగే ఉంటే తనకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని చాణక్యుడు పేర్కొన్నాడు.
ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం
కాకి ఎవరిని పూర్తిగా నమ్మదట. ఈ లక్షణం వల్ల చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అంటాడు చాణక్యుడు. మనుషులు కూడా ఇతరుల గురించి పూర్తిగా తెలియకుండా నమ్మకూడదని చాణక్య నీతి చెబుతోంది. గుడ్డిగా నమ్మితే లేనిపోని సమస్యలు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.
ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం
సాధారణంగా కాకి తను ఉన్న చోటు నుంచి తొందరగా పారిపోదట. ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటుందని చాణక్యుడి బోధనల్లో వివరించాడు. మనుషులు కూడా ఈ విషయాన్ని నేర్చుకొని ఆచరించడం ద్వారా వారిని విజయం వరిస్తుందట.
శారీరక అవసరాలు
చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఏకాంతంగా ఉన్నప్పుడే శారీరక అవసరాలు తీర్చుకోవాలి. అలాగే వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. కొన్నిసార్లు నమ్మినవాళ్లే మోసం చేస్తారని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి.