ప్రేమించిన వారిని దూరం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. ప్రేమించిన వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని ఆశపడుతుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల వారి ప్రేమకు దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
కొందరికి ఇష్టం లేకున్నా ప్రేమకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కొందరు కావాలనే తమ ప్రేమను దూరం చేసుకుంటారు. అయితే.. అసలు ప్రేమికులు, భార్యభర్తలు తమ బంధానికి బ్రేకప్ చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
ప్రేమలో పడిన కొత్తలో.. ఎదుటివారు ఏం చేసినా మనకు విపరీతంగా నచ్చేస్తోంది. కానీ.. ఆ బంధం పాతగా అవుతున్న కొద్దీ.. ఒకప్పుడు నచ్చినవే.. తర్వాత నచ్చకుండా పోతాయి. ఈ క్రమంలో.. పార్ట్ నర్ విషయంలో తమకు నచ్చని విషయాలను అర్థం చేసుకోకుండా.. ప్రతిసారీ వాటిని ఎత్తిచూపుతూ ఉంటారు. ఈ విషయంలోనే గొడవలు పెద్దవై పెరిగి.. చివరకు బ్రేకప్, విడాకులకు దారితీస్తున్నాయట.
మనుషులన్నాక ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయాలు, అంచనాలు ఉంటాయి. తమ అంచనాలను తమ పార్ట్ నర్ రీచ్ అవ్వలేకపోతున్నారనే విషయంలోనే వారు తరచూ గొడవలు పడటం వల్ల తేడాలు వచ్చి.. విడిపోవడానికి కారణమౌతుందట.
ప్రతి విషయంలో నాకేమి కావాలి.. అని ఆలోచించే బదులు.. మనకు ఏం కావాలి అని ఆలోచించడం మొదలుపెడితే.. దంపతుల మధ్య అసలు తేడాలు రావని.. సంసారం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
నమ్మకం, విధేయత రెండూ ఎప్పుడూ ఒకేథాటిపై ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. మీ బంధం మొదలైన రోజు నుంచి..చివరి వరకు నమ్మకం అనే దానిపైనే రిలేషన్ ఆధారపడి ఉంటుంది. అలా లేని సమయంలో.. తేడాలు రావడం సహజమే.
ఏ బంధం సాఫీగా సాగాలన్నా.. వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. ఏ విషయమైనా అర్థమయ్యేలా చెప్పుకోవాలి. మీ మనసులోనే దాచుకుంటే ఆ విషయం పార్ట్ నర్ కి ఎలా చేరుతుంది. విడాకులకు ప్రధాన కారణం ఇదే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మూడో వ్యక్తికి చోటు లేకుండా చేసుకోవాలి.
ఇవి కాకుండా.. డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా బ్రేకప్ కి కారణమౌతున్నాయి ఈ రోజుల్లో. ఎక్కువ సంపాదించడం లేదని కొందరు.. ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని మరికొందరు విడిపోతున్నారు.
ఈ డబ్బు వ్యవహారాల్లోనూ ఇద్దరికీ అండర్ స్టాండింగ్ చాలా అవసరం. అది ఉంటే.. డబ్బు ఉన్నా.. లేకున్నా ఆనందంగా జీవించవచ్చు.