పెళ్లి అనేది మనిషి జీవితంలో గొప్ప మలుపు. ఇద్దరు జీవితాలలోని పెను మార్పుని తీసుకువస్తుంది పెళ్లి. పెళ్లికి ముందు ఉన్నట్లే పెళ్లి తర్వాత కూడా జీవిస్తాను అంటే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకే పెళ్లి తర్వాత అందమైన బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి.
అదేమిటంటే ముందుగా నిబద్ధత. మనం తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మనకి నచ్చినట్లుగా ఉంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే అక్కడ బానే ఉంటుంది. కానీ కొత్త సంసారంలో కొత్త మనుషుల మధ్య నిబద్ధత లేకపోతే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ డిస్టబెన్స్ ప్రారంభమవుతుంది.
ఎవరు ఏ పని చేయాలో, ఎప్పుడు చేయాలో అది ఖచ్చితంగా అప్పుడు చేసుకోవటం చాలా మంచిది. అలాగే బాధ్యత కూడా కలిగి ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే ఇది మీ సంసారం అని గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకునే బాధ్యత మీ భవిష్యత్తుకి పునాది. అలాగే జవాబుదారీతనాన్ని కూడా కలిగే ఉండటం ఎంతో అవసరం.
పెళ్లికి ముందు ఉన్న విచ్చలవిడితనం, జవాబు దారి లేనితనం తల్లిదండ్రుల దగ్గర కుదురుతుంది కానీ భార్యకి భర్త భర్తకి భార్య జవాబుదారీ అయినప్పుడు ఆ సంసారం ఎంతో కుదురుగా ఉంటుంది. అలాగే క్షమించే గుణం కూడా మీ సంసారాన్ని నిలబెట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
మీరు మీ భాగస్వామిని క్షమించినప్పుడు అవతలి వాళ్లు కూడా మీరు పొరపాటున చేసే తప్పులను క్షమించడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు.అలాగే కొత్త బంధంలో మీరు వేసే ప్రతి అడుగు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భాగస్వామి మీద ప్రభావం చూపిస్తుంది.
కాబట్టి ఆచితూచి అడుగు వేయడం ఎంత అవసరం. అలాగే ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం, కలిసే కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకోవడం అనేది ఒక కొత్త కాపురాన్ని భవిష్యత్తులో చక్కనైన దాంపత్యం గా మారటానికి బంగారు బాట వేస్తుంది.