ఈ డిజిటల్ యుగంలో పిల్లల చేతిలో బొమ్మల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడో ఆక్రమించేశాయి. పిల్లల ఆటలు, మాటలు, నవ్వులు అన్నీ స్క్రీన్ వెలుగులో కలిసిపోతున్నాయి. అయితే ఎక్కువసేపు ఫోన్ చూసే పిల్లల గురించి సైకాలజీ ఏం చెప్తోందో మీకు తెలుసా?
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు పిల్లల జీవితంలో భాగంగా మారిపోయాయి. ఆన్‌లైన్ క్లాసులు, వినోదం, ఆటలు, సోషల్ మీడియా అన్నీ కలిసి పిల్లలను స్క్రీన్‌లో బంధిస్తున్నాయి. అయితే నియంత్రణ లేకుండా ఫోన్ వాడకం పిల్లల మానసిక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సైకాలజీ చెబుతోంది.
27
వాటిపై ఆసక్తి తగ్గుతుంది
సైకాలజీ విశ్లేషణల ప్రకారం పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల మెదడులోని అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. నిరంతరం వీడియోలు, రీల్స్, గేమ్స్ లాంటి వేగవంతమైన కంటెంట్ చూడటం వల్ల పిల్లలు ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతారు. చదువు, కథలు వినడం, ఆటలు ఆడటం వంటి సహజ కార్యకలాపాలపై ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల పిల్లల్లో ఓర్పు, సహనం వంటి లక్షణాలు తగ్గిపోతాయి.
37
భావోద్వేగపరంగా మార్పులు..
సైకాలజీ ప్రకారం ఫోన్ ఎక్కువగా చూసే పిల్లల్లో భావోద్వేగ పరంగా కూడా మార్పులు కనిపిస్తున్నాయి. స్క్రీన్‌కు దూరంగా ఉంచినప్పుడు చిరాకు, కోపం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఎమోషనల్ డిపెండెన్సీకి సంకేతమని సైకాలజీ చెబుతోంది. భావాలను వ్యక్తపరచడం, ఇతరులతో మాట్లాడటం తగ్గిపోయి, వర్చువల్ ప్రపంచమే నిజమైన ప్రపంచంలా పిల్లలు ఫీల్ అవుతున్నారని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు చిన్నప్పటి నుంచే తోటి పిల్లలతో కలిసి ఆడటం, మాట్లాడటం, గొడవలు పడటం, మళ్లీ కలవడం వంటివి సామాజిక జీవనానికి అవసరం. కానీ ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు ఒంటరిగా ఉండటానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బలహీనమవుతాయి. కళ్లలోకి చూసి మాట్లాడటం, భావాలను అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు వీరిలో తగ్గిపోతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
57
నిద్రపై ప్రభావం
నిద్రపై కూడా ఫోన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పడుకునే ముందు ఫోన్ చూడటం వల్ల నిద్ర ఆలస్యమవుతుంది. బ్లూ లైట్ కారణంగా నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల పిల్లల్లో అలసట, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సైకాలజీ స్పష్టం చేస్తోంది.
67
సరైన పరిమితులు అవసరం..
అయితే ఫోన్ పూర్తిగా చెడ్డదని కాదు. సరైన పరిమితులు, మార్గదర్శకత్వం ఉంటే ఫోన్ పిల్లలకు ఉపయోగకరంగా మారుతుంది. చదువుకు సంబంధించిన యాప్స్, క్రియేటివ్ వీడియోలు, జ్ఞానాన్ని పెంపొందించే కంటెంట్ పిల్లల అభివృద్ధికి సహాయపడతాయి. నిజానికి ఫోన్ సమస్య కాదు, దాని వినియోగ విధానమే సమస్య అని సైకాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
77
వారి పాత్ర కీలకం
తల్లిదండ్రుల పాత్ర కూడా ఇక్కడ అత్యంత కీలకం. పిల్లలకు ఫోన్ ఇవ్వడం కంటే ముందు స్పష్టమైన నియమాలు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఎంతసేపు ఫోన్ వాడాలి, ఏ కంటెంట్ చూడాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఫోన్ వాడకుండా ఉండటం మంచిది. వారితో కలిసి ఆడటం, మాట్లాడటం, కథలు చెప్పడం, బయట ఆటలకు ప్రోత్సహించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.