Child Psychology: పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తే.. వారు పెద్దాయ్యాక ఎలా మారుతారో తెలుసా?

Published : Jan 20, 2026, 01:58 PM IST

చాలామంది తల్లిదండ్రుల పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తుంటారు. మనం పడిన కష్టం పిల్లలు పడకూడదనుకుంటారు. కానీ ఇలా అడిగినవన్నీ ఇస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా మారుతారో తెలుసా? వారికి భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే శక్తి ఉంటుందా? సైకాలజీ ఏం చెబుతోంది?

PREV
15
Child Psychology

పిల్లలు అడిగిన ప్రతిదీ వెంటనే కొనిచ్చే అలవాటు ప్రేమగా, శ్రద్ధగా కనిపించినా, దాని ప్రభావాలు వారి భవిష్యత్ వ్యక్తిత్వంపై చాలా లోతుగా ఉంటాయని సైకాలజీ చెబుతోంది. దీనివల్ల ఏది అడిగితే అది దొరుకుతుంది అనే భావన పిల్లల మనసులో ముద్రపడుతుంది. ఇది కేవలం వస్తువుల విషయంలోనే కాదు, జీవితంలో ఆశలు, సంబంధాలు, ఉద్యోగం, బాధ్యతలు వంటి అన్ని అంశాలపై ప్రభావం చూపుతుంది. 

సాధారణంగా పిల్లలు చిన్న వయసులోనే సహనం, నిరీక్షణ, త్యాగం, పరిమితులు అర్థం చేసుకోవాలి. ఇవి నేర్చుకోకుండా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగపరంగా బలహీనంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని సైకాలజీ చెబుతోంది.

25
నిరాశను తట్టుకోలేరు

సైకాలజీ విశ్లేషణల ప్రకారం పిల్లల ప్రతి కోరికను తీర్చడం వల్ల వారి “ఇంపల్స్ కంట్రోల్” సరిగ్గా అభివృద్ధి చెందదు. ఏదైనా సరే వెంటనే కావాలనే తత్వం బలపడుతుంది. ఆలస్యం, నిరాకరణ, పరిమితి వంటి అనుభవాలు లేకపోవడం వల్ల వారు నిరాశను తట్టుకోలేని వ్యక్తులుగా మారుతారు. పెద్దయ్యాక ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం అయినా, సంబంధాల్లో అంగీకారం రాకపోయినా, చిన్న విషయాలకే కోపం, డిప్రెషన్ లేదా ఇతరులపై నింద వేయడం వంటి ప్రవర్తనలు కనిపిస్తాయి. నాకే అన్నీ దక్కాలి, నేనే అర్హుడిని అన్న భావన పెరిగిపోతుంది.

35
ఆ విలువను అర్థం చేసుకోలేరు

ప్రతిదీ ఈజీగా దొరికిన పిల్లలు కష్టపడి సంపాదించడంలోని విలువను అర్థం చేసుకోలేరు. సైకాలజీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కష్టానికి, ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని పిల్లలు చిన్నప్పుడే నేర్చుకోవాలి. అడిగిన వెంటనే బొమ్మ, మొబైల్, ఖరీదైన వస్తువులు దొరికితే, శ్రమకు విలువ లేదనే భావన ఏర్పడుతుంది. దీనివల్ల పెద్దయ్యాక బాధ్యతలు తీసుకోవడంలో ఆసక్తి తగ్గుతుంది. ఈ ప్రవర్తన ఆర్థిక నిర్వహణలో కూడా సమస్యలు తెస్తుంది. ఖర్చులు నియంత్రించలేక అప్పుల్లో కూరుకుపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

45
సంబంధాల్లో విభేదాలు ఎక్కువ

అంతేకాదు చిన్నప్పుడు అన్నీ దొరికిన పిల్లలకు ఇతరుల అవసరాలు, భావాలు అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. పెద్దయ్యాక స్నేహితులు, జీవిత భాగస్వామి, సహోద్యోగులతో సర్దుబాటు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రతి విషయంలో తమ మాటే నెగ్గాలని భావించడం వల్ల సంబంధాల్లో విభేదాలు ఎక్కువవుతాయి. సైకాలజీ ప్రకారం ఇది దీర్ఘకాలంలో ఒంటరితనం, అసంతృప్తికి దారితీస్తుంది.

55
వాటి మధ్య తేడా నేర్పించడం ముఖ్యం

సైకాలజీ ప్రకారం.. పిల్లలకు అవసరం, కోరిక మధ్య తేడా నేర్పడం చాలా ముఖ్యం. “ఇది ఎందుకు కావాలో చెప్పు”, “దీని కోసం కొద్ది రోజులు ఆగుదాం” వంటి మాటలు పిల్లలను ఆలోచించేలా చేస్తాయి. ఆలస్యంగా దొరికిన వస్తువు విలువను పిల్లలు ఎక్కువగా గుర్తిస్తారు. అలాగే, చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం, కష్టపడి సాధించినప్పుడు ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 

పిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చే అలవాటు తాత్కాలిక ఆనందం ఇచ్చినా, దీర్ఘకాలంలో వారి వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చే ప్రమాదం ఉంది. ప్రేమ అంటే ప్రతిదీ ఇవ్వడం కాదు, జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం. పరిమితులు, సహనం, కష్టపడి సాధించడం అనే విలువలు నేర్పినప్పుడే పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories