ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పొచ్చు.సాంకేతికంగా వచ్చిన మార్పులే దీనికి కారణం కావచ్చు. ఈ కాలం పిల్లలు ఛాన్స్ దొరికితే టీవీలు చూడటం, ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. పుస్తకం పట్టి చదివే అలవాటు ఉన్న పిల్లలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. స్కూల్ బుక్స్ మాత్రమే కాదు.. స్టోరీ బుక్స్ కూడా చదవడం లేదు. మీ పిల్లలు కూడా పుస్తకం వంక చూడకుండా, ఎప్పుడూ ఫోన్లు, ల్యాప్ టాప్స్ అంటూ తిరుగుతున్నారా? మరి, పిల్లల్లో బుక్ రీడింగ్ అలవాటు ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మీతో మొదలు పెట్టండి..
పిల్లలు దాదాపు ఏ విషయం అయినా తమ పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటారు. అది మంచి అయినా, చెడు అయినా సరే. అందుకే.. మీ పిల్లలు ఏదైనా మంచి నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే, ముందుగా మీరు దాన్ని ఫాలో అవ్వాలి.మీ పిల్లల ముందు ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం, న్యూస్ పేపర్ చదవడం మీరు మొదలుపెట్టండి. ఇంట్లో పెద్దవారు అందరూ ఏదో ఒకటి చదువుతున్నారు అనే విషయాన్ని పిల్లలు గ్రహించినప్పుడు వారికి కూడా దానిపై ఆసక్తి పెరుగుతుంది.
ఇంట్లో చిన్నపాటి లైబ్రరీ..
పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలంటే దానికి తగిన ఏర్పాట్లు కూడా మీరు చేయాలి. ఒక చిన్న లైబ్రరీ రూమ్ లాగా ఏర్పాటు చేయండి. కూర్చోవడానికి చైర్, టేబుల్, మంచి లైటింగ్ లాంటి సదుపాయాలు ఉంటే.. వారికి కూడా ఆసక్తి ఉంటుంది.
చదవడాన్ని ఎంజాయ్ చేయాలంటే..
పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలంటే ఒకేసారి పెద్ద పెద్ద బుక్స్ ఇవ్వకండి. నెమ్మదిగా కథల పుస్తకాలు ఇవ్వండి. అది కూడా ఆకర్షణీయంగా ఉండే బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలను పరిచయం చేయండి. వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగితే.. నెమ్మదిగా ఏ పుస్తకం చదవడానికి అయినా ఇంట్రస్ట్ చూపిస్తారు. అంతేకాదు.. వారు చదువుతున్నది పైన బొమ్మల్లో కనిపిస్తే.. వారికి మరింత బాగా అర్థమౌతుంది కూడా.
వారు తమ సొంత పుస్తకాలను ఎంచుకోనివ్వండి:
పిల్లలను నిర్దిష్ట పుస్తకాలను చదవమని బలవంతం చేయకండి.బదులుగా, లైబ్రరీ లేదా పుస్తక దుకాణానికి తీసుకెళ్లి వారికి ఆసక్తి ఉన్న కథలను ఎంచుకోనివ్వండి. అది కామిక్స్, గ్రాఫిక్ నవలలు లేదా ఫాంటసీ కథలు కావచ్చు. పిల్లలు తాము చదివిన దానిలో తమ అభిప్రాయాన్ని చెప్పగలిగినప్పుడు, వారు తమకు ఇష్టమైన పుస్తకాన్ని చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఏ అలవాటు అయినా సరే, పిల్లలకు ఒక్క రోజులో రాత్రికి రాత్రి వచ్చేయదు. మీరే కాస్త ఓపికగా ఉండి.. నెమ్మదిగా దానిని అలవాటు చేయాలి. మీరు ఎంత ఓపికగా ఉంటే.. వారు అంత బాగా మంచి అలవాట్లు నేర్చుకుంటారు.