పిల్లలు ఎదిగే సమయంలో చదువు అనేది వారికి ఒక భాగం మాత్రమే.దాదాపు పేరెంట్స్ అందరూ పిల్లలను మంచి స్కూల్ లో చేర్పించామా, మంచి ట్యూషన్ లో జాయిన్ చేశామా లేదా అని మాత్రమే చూస్తారు. అవి నిజానికి ముఖ్యమే. కానీ, వారి జీవితానికి అవసరం అయ్యే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా కచ్చితంగా నేర్పించాలి అనే విషయం మర్చిపోతుంటారు. పెద్దయ్యాక వారే నేర్చుకుంటారులే అని వదిలేస్తారు. కానీ.. పిల్లలకు 7, 8 ఏళ్లు వచ్చినప్పటి నుంచి కొన్ని విషయాలు నేర్పించడం మొదలుపెట్టాలి.
7, 8 ఏళ్ల వయసు నుంచే పిల్లల మనసు వేగంగా ఎదగడం మొదలౌతుంది. ఈ సమయంలోనే వారి వ్యక్తిత్వానికి బలమైన పునాది ఏర్పడుతుంది. అందుకే, ఈ వయసు నుంచే వారికి నైతిక విలువలు నేర్పించాలి. అవి పిల్లల భవిష్యత్తుకు సహాయపడతాయి. మరి, అవేంటో చూద్దామా..
1. సంస్కారంగా మాట్లాడే పద్ధతి
చిన్న పిల్లలకు ఎవరి ముందు ఎలా మాట్లాడాలి అనే విషయం తెలీదు. పెద్దవారిని ఎలా గౌరవించాలి, వారితో ఎలా ప్రవర్తించాలో నేర్పించడం చాలా ముఖ్యం. ఏదైనా మాట్లాడే ముందు దయచేసి, ధన్యవాదాలు, క్షమించండి వంటి పదాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఇది వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా, సమాజంలో గౌరవం పొందేలా చేస్తుంది.
2. డబ్బు విలువ తెలుసుకోవడం
డబ్బు విలువను చిన్న వయసులోనే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. తల్లిదండ్రులు పని చేసి సంపాదిస్తున్నారని, దాన్ని నిష్ప్రయోజనంగా ఖర్చు చేయడం మంచిదికాదని వివరించాలి. చిన్న చిన్న పొదుపు అలవాట్లు , పిగ్గీ బ్యాంకులో డబ్బులు దాచుకోవడం, దుబారా ఖర్చులు చేయకూడదని పిల్లలకు ప్రాక్టికల్ గా నేర్పించాలి.
3. సోషల్ మీడియా ,టెక్నాలజీ వాడకం
టెక్నాలజీ ఇప్పుడు పిల్లల జీవితంలో భాగమైపోయింది. కానీ దాని సరైన వినియోగం నేర్పించకపోతే అది సమస్యగా మారుతుంది. చిన్న వయసులోనే స్క్రీన్ టైం పరిమితి, ఏ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలో, ప్రైవసీ పరిరక్షణ ఎలా చేయాలో వివరించాలి. అనవసరపు డిజిటల్ అడిక్షన్ నుంచి రక్షించే దిశగా చిన్న నిబంధనలు రూపొందించాలి.
4. వారి పనులు వారు చేసుకోవడం..
వారు తినడం, తయారవడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం వంటి చిన్న పనులు తామే చేసుకోవడం అలవాటు పడాలి. ఇది స్వీయనిర్బంధాన్ని పెంచుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. సమయం విలువను అర్థం చేసుకోవడానికి ఒక టైమర్ వాడటం, టు-డూ లిస్ట్‌లు చేయడం వంటి పద్ధతులు ఉపయోగించవచ్చు.
5. నైతిక విలువలు,బాధ్యత
పిల్లలకు నిజాయితీ, కరుణ, సహనంతో ప్రవర్తించడం వంటి విలువలు చిన్న వయసులోనే నేర్పాలి. నమ్మకాన్ని చూరగొనడం కంటే విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంతో గొప్ప విషయం అని వివరించాలి. మంచి పనులు చేసినప్పుడు అభినందించడం, తప్పు చేసినప్పుడు ఆప్యాయంగా సరిదిద్దడం అవసరం.
6. సహనశీలత ,నెమ్మదిగా ఎదగడం
ప్రతి విషయాన్ని వెంటనే పొందాలన్న కోరికను కంట్రోల్ చేయడం అవసరం. పిల్లలకు "ప్రయత్నం – ఫలితం" మధ్య ఉన్న గ్యాప్‌ను అర్థం చేసుకునేలా చేయాలి. అడిగిన వెంటనే ఏదీ రాదని, చూసిన ప్రతీదీ కావాలని కోరుకోకూడదని కూడా పిల్లలు తెలుసుకోవాలి.