పిల్లలకు చిన్న వయసు నుంచే కొన్ని మంచి అలవాట్లు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుంది. ఈ అలవాట్లు పిల్లల శారీరక, మానసిక, భావోద్వేగ అభివృద్ధికి దారితీస్తాయి. వారిని బాధ్యతాయుతమైన, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగే వ్యక్తులుగా మార్చుతాయి.
పిల్లల భవిష్యత్తు బలంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించడం తల్లిదండ్రులు ఇచ్చే విలువైన బహుమతి. కొన్ని మంచి అలవాట్లు పిల్లల జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయి. శారీరకంగా, మానసికంగా, భావోద్వే పరంగా వారిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయి. పిల్లల వ్యక్తిత్వానికి ఇవి పునాది లాంటివి. మరి చిన్నవయసు నుంచే పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన ఆ అలవాట్ల గురించి తెలుసుకుందామా..
26
త్వరగా నిద్రలేచే అలవాటు
పిల్లలు త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవడం.. వారి శారీరక, మానసిక, భావోద్వేగ అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరం. టైంకి నిద్రపోయి, టైంకి లేచే పిల్లలు ఉదయం లేవగానే ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. వారి మెదడు స్పష్టంగా పనిచేస్తుంది. చదువు, క్రీడలు, రోజువారీ పనుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. త్వరగా నిద్రపోవడం ద్వారా శరీరంలో ఎదుగుదలకు అవసరమైన హార్మోన్లు టైంకి విడుదలై శారీరక వృద్ధి ఉంటుంది. మంచి నిద్ర వల్ల చిరాకు, ఒత్తిడి, ఆందోళన తగ్గి భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుంది.
36
పుస్తకాలు చదివే అలవాటు
పిల్లలు పుస్తకాలు చదవడం వల్ల వారి ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. కథలు, పాత్రలు, సంఘటనలు పిల్లల మనసును విభిన్న ప్రపంచాలకు తీసుకెళ్లి, ఆలోచనాశక్తికి పదునుపెడతాయి. చదవడం వల్ల భాషపై పట్టు, మాట్లాడే తీరు మెరుగుపడుతుంది. చదవడం అలవాటు ఉన్న పిల్లలు ఎక్కువ ఏకాగ్రతతో ఉంటారు.
పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకునే పిల్లలు శారీరకంగా బలంగా, చురుకుగా ఉంటారు. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు వంటివి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే సరిగ్గా తినే అలవాటు ఉన్న పిల్లలకు ఊబకాయం, డయాబెటిస్, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకునే అలవాటు.. పిల్లలు జీవిత కాలం ఆరోగ్యంగా ఉండడానికి పునాది వంటిది.
56
నిజం చెప్పే అలవాటు
నిజం చెప్పడం వల్ల పిల్లల్లో నిజాయతీ, నమ్మకం, ధైర్యం వంటి గుణాలు సహజంగా పెరుగుతాయి. నిజం చెప్పే పిల్లలు తప్పు చేసినా.. దాన్ని ఒప్పుకుంటారు. తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ అలవాటు పిల్లల మానసిక ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే అబద్ధం చెప్పే పిల్లలు నిజం ఎక్కడ బయటపడుతుందోనని ఒత్తిడికి లోనవుతుంటారు.
66
కోపాన్ని కంట్రోల్ చేసుకునే అలవాటు
కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిసిన పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకుండా, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ అలవాటు వల్ల గొడవలు తగ్గుతాయి. అంతేకాదు కోపాన్ని నియంత్రించగలిగే పిల్లల్లో సహనం సహజంగా పెరుగుతుంది. సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది.