Parenting: పిల్లలకు మంచి మార్కులు రావాలని పేరెంట్స్ కోరుకుంటారు. అయితే మార్కులే లక్ష్యంగా మారితే పిల్లల్లో చదువు తగ్గి, పరీక్షలంటే భయం పెరుగుతుంది. అందుకే పిల్లలకు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే తల్లిదండ్రులకు కచ్చితంగా ఈ నాలుగు అలవాట్లు ఉండాల్సిందే.
ఎన్ని మార్కులొచ్చాయని కాకుండా.. ఏం నేర్చుకున్నావని అడగండి
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలామంది తల్లిదండ్రులు అడిగే మొదటి ప్రశ్న.. ఈ రోజు ఎన్ని మార్కులొచ్చాయి?అని. అలా కాకుండా ఈ రోజు ఏం నేర్చుకున్నావు? అని అడిగితే పిల్లల్లో ఆలోచించే అలవాటు పెరుగుతుంది. చదువును కేవలం మార్కులతో ముడిపెట్టకుండా, కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో చదువుపై ఆసక్తి పెరిగి, తప్పులు చేస్తామనే భయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
24
తెలివితేటలనే కాదు.. చేసిన పనిని ప్రశంసించండి
నువ్వు చాలా తెలివైనవాడివి అంటూ పిల్లలను పొగడటం కంటే ఒక పనిని పూర్తి చేయడానికి వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించడం ముఖ్యం. ఉదాహరణకు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టకుండా.. గతంలో కంటే ఎంత మెరుగయ్యారో చెప్పండి. క్రమంగా చదవడం, కష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వంటి అలవాట్లను ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల తప్పులు జరిగినా వెనకడుగు వేయకుండా, కొత్త విషయాలను నేర్చుకోవడానికి పిల్లలు సిద్ధపడతారు.
34
హాబీలను కూడా పోటీగా మార్చకండి
పిల్లలకు డ్రాయింగ్, మ్యూజిక్, గేమ్స్ ఇలా ఇష్టాలు ఉండొచ్చు. అయితే, ప్రతి విషయంలోనూ ఫస్ట్ రావాలని, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలని ఒత్తిడి చేస్తే.. వారికి మొదట్లో ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గిపోవచ్చు. పిల్లలు తమకు నచ్చిన పనులను ఆనందంగా చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. హాబీల ద్వారా వారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. ప్రతి పనిలోనూ గెలవాల్సిన అవసరం లేదని, నేర్చుకోవడం కూడా ముఖ్యమేనని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
నీ ఫ్రెండ్‌కు ఎక్కువ మార్కులొచ్చాయి.. నువ్వెందుకు తెచ్చుకోలేకపోయావు? అంటూ ఇతర పిల్లలతో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం పెరిగే అవకాశం ఉంది. పిల్లల్లో నేర్చుకోవడం, ఇంట్రెస్ట్, సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఇతరులతో పోల్చే బదులు, గతంలో కంటే ఇప్పుడు ఎంత మెరుగయ్యారో గుర్తించండి. వారి బలాలను ప్రోత్సహిస్తూ, బలహీనతలను అధిగమించేందుకు సహాయం చేయండి. దీంతో పిల్లలు తమను తాము నమ్మడం నేర్చుకుంటారు.