
అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా భారత్ తన స్వదేశీ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. ప్రజలను సైతం స్వదేశీ వస్తువులు, సేవలకు ప్రాధాన్యత ఇచ్చే చర్యలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా అమెరికన్ కంపెనీ జీమెయిల్ (Gmail) నుండి భారతీయ టెక్ కంపెనీ జోహో మెయిల్ (Zoho Mail) కు మారినట్టు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్వదేశీ ఉత్పత్తుల వినియోగం’ పిలుపు నేపథ్యంలో చోటు చేసుకుంది.
అమిత్ షా తన కొత్త ఇమెయిల్ చిరునామా amitshah.bjp@zohomail.in అని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ Xలో ప్రకటించారు. ఆయన పోస్టులో, “అందరికీ నమస్తే.. నేను జోహో మెయిల్ కు మారాను. ఈ విషయంలో మీరు చూపిన అటెన్షన్ కు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
తన కామెంట్స్ తో అమిత్ షా పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మెసెజ్ ఇచ్చారు. అమిత్ షా తన చివరి కామెంట్స్ లో “Thank you for your kind attention to this matter” అని పేర్కొన్నారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ తన ట్రూత్ సోషల్ మీడియా (Truth Social) పోస్టుల్లో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు అమిత్ షా జోహో మెయిల్ కు మారుతూ అదే రకంగా స్పందించారు. దీంతో అమెరికా ప్రెసిడెంట్ కు పరోక్షంగా ఒక సందేశం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీ టారిఫ్ లతో పాటు అమెరికన్ కంపెనీలలో స్థానికులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించమని ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. షా చర్యలను కూడా ఇందులో భాగంగా చూడవచ్చు.
భారతదేశం కూడా తన టెక్నాలజీ స్వతంత్రతను పెంచుకునే దిశలో ముందుకు వెళ్తుందని ఈ నిర్ణయంతో తెలియజేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ‘ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జోహో వంటి స్థానిక సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రభుత్వ మద్దతుతో ఎదుగుతున్నాయి.
జోహో మెయిల్ (Zoho Mail) అనేది చెన్నై కేంద్రంగా ఉన్న భారతీయ టెక్నాలజీ సంస్థ జోహో కార్పోరేషన్ (Zoho Corporation) రూపొందించిన సురక్షితమైన, యాడ్స్ లేని ఇమెయిల్ సేవ. దీన్ని 2008లో ప్రారంభించారు.
ఈ సర్వీస్‌లో ఎన్‌క్రిప్టెడ్ ఇమెయిల్ ట్రాన్స్‌మిషన్, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, ఇండియా, యూఎస్‌లో ఉన్న సర్వర్లు వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు, నిపుణులు ఎక్కువగా దీనిని వినియోగిస్తున్నారు.
జోహో మెయిల్ ప్రైవసీ, డేటా రక్షణ పైన దృష్టి పెట్టినందున.. ఇది భారత్ లో జీమెయిల్, అవుట్ లుక్ లాంటి అంతర్జాతీయ సేవలకు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.
అమిత్ షా తర్వాత, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా గత నెలలో తన కార్యాలయ పనుల కోసం జోహో సాఫ్ట్‌వేర్ సూట్ ఉపయోగిస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ కూడా తమ అధికారులకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (Microsoft Office), గూగుల్ వర్క్ స్పేస్ (Google Workspace) బదులు జోహో సేవలను ఉపయోగించాలని సూచించింది.
ఇది ప్రభుత్వ విభాగాల స్థాయిలో భారతీయ టెక్నాలజీ వినియోగం పెంచే చర్యగా పరిగణించవచ్చు. విదేశీ ప్లాట్‌ఫార్మ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రభుత్వ వ్యూహంలో భాగమని అధికారులు తెలిపారు.
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అమిత్ షా నిర్ణయాన్ని ప్రశంసించారు. “దీనిని జోహో లో 20 ఏళ్లుగా కృషి చేస్తున్న ఇంజినీర్లకు అంకితం చేస్తున్నాను. వారు భారతదేశంలోనే ఉండి పని చేశారు, వారి విశ్వాసం నేడు ఫలించింది” అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, జోహో మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ కూడా ప్రజాదరణ పొందుతోంది. ఈ యాప్‌లో సైన్‌అప్స్ మూడు రోజుల్లో 3,000 నుండి 3.5 లక్షలకు పెరిగి, 100 రెట్లు వృద్ధి సాధించింది. అరట్టై యాప్ “సురక్షితమైనది, వినియోగదారులకు సులభమైనది.. పూర్తిగా ఉచితం” అని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
అమిత్ షా జోహో మెయిల్ మార్పు కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, అది భారత డిజిటల్ స్వతంత్రతకు సంకేతం. అమెరికా టారిఫ్ ఒత్తిడుల మధ్య, భారత ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడే విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. జోహో మెయిల్ ను అధికారిక కమ్యూనికేషన్‌లో ఉపయోగించడం ద్వారా భారత ప్రభుత్వం ‘స్వదేశీ సాఫ్ట్‌వేర్ విప్లవం’ను ఆరంభించిందని చెప్పవచ్చు. ఇది దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది.