Women Reservation Act 2023 : మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పార్లమెంటులో చర్చలు జరుగుతున్న తరుణంలోనే, 2023 నాటి మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దేశ రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2023లో ఆమోదం పొందిన 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ల చట్టం) గురువారం నుంచి నుంచే అమల్లోకి వస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ అనూహ్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా లభించనుంది. అయితే, దీని అమలు ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన పై పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.
26
అకస్మాత్తుగా అమల్లోకి చట్టం.. కారణమేంటి?
కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2026 ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఈ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం-2023లోని సెక్షన్-1(2) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుత లోక్‌సభకు ఇది వర్తించదు. రాబోయే జనగణన తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికన మాత్రమే మహిళలకు సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఒకవైపు పార్లమెంటులో ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే, మరోవైపు నోటిఫికేషన్ రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
36
దక్షిణాది రాష్ట్రాల సీట్లపై అమిత్ షా ఏమన్నారు?
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గి, అన్యాయం జరుగుతుందన్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు. "దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం నష్టం జరగదు. దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్యను 50 శాతం పెంచుతున్నాం. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లు 816కి పెరుగుతాయి. పెరిగే సీట్లన్నీ మహిళలకే కేటాయిస్తాం. మిగిలిన సీట్లు యథాతథంగా ఉంటాయి" అని ఆయన ప్రకటించారు.
• ఆంధ్రప్రదేశ్: 25 నుంచి 38 సీట్లకు పెంపు.
• తెలంగాణ: 17 నుంచి 26 సీట్లకు పెంపు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం ప్రస్తుతం ఉన్న 24 శాతం వద్దే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో కేంద్రం దొడ్డిదారిన రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష కూటమి (INDIA) నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ, "మహిళా రిజర్వేషన్లకు మేం అనుకూలం, కానీ దానికి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఏంటి?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే 33 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, బీజేపీ నారీ (మహిళ)ని ఓట్ల కోసం నారా (నినాదం)గా మార్చేసిందని విమర్శించారు. ఇందులో ఓబీసీ, ముస్లిం మహిళలకు కూడా కోటా ఉండాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని ముక్కలుగా చూడటం మానుకోవాలని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటేనని హితవు పలికారు. "మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ నాకు వస్తుందని భయపడితే.. అది మీకే ఇచ్చేస్తాను. కావాలంటే ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్ష నేతల ఫొటోలతో ప్రకటనలు ఇస్తాను. కానీ మహిళల హక్కులను అడ్డుకోవద్దు" అని ప్రధాని అన్నారు. గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఇదని, రాజకీయ రంగు పూయకుండా బిల్లుకు సపోర్టు చేయాలని అన్నారు.
66
పెరగనున్న సభ సంఖ్య.. బిల్లు గట్టెక్కేనా?
ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో నెగ్గాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం, లోక్‌సభలో బిల్లు నెగ్గాలంటే కనీసం 360 మంది సభ్యుల సపోర్టు అవసరం. ఎన్డీయేకి 293 మంది బలం ఉండగా, మరో 60 నుంచి 70 మంది సభ్యుల సపోర్టు తప్పనిసరి. విపక్షాలు ఓటింగ్ సమయంలో వాకౌట్ చేసినా లేదా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా ప్రభుత్వం ఈ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల కల సాకారం కావాలంటే ఈ గండం గట్టెక్కడం అత్యంత కీలకం.