ప్రసన్న శంకర్ నారాయణ ఒక ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్. హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ కంపెనీ రిప్లింగ్ వ్యవస్థాపకుడైన శంకర్ ఎన్నో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రిప్లింగ్ కంపెనీ సుమారు 10 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. ఇదంతా బాగానే ఉన్నా 12 ఏళ్ల క్రితం దివ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిదీ చెన్నై కాగా వివాహం తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ జంటకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
వేల కోట్ల సంపాదన, అమెరికాలో సొంత కంపెనీ.. జీవితం సాఫీగా సాగుతోందని అనుకుంటున్న సమయంలో శంకర్-దివ్యల మధ్య గత కొన్నిరోజుల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇద్దరూ విడాకుల కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నారు. భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేసింది. దీనిపై అమెరికా కోర్టులో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ అంశం కాస్త తాజాగా ఇండియాకు చేరింది.
ఇటీవల భారత్‌కు వచ్చిన దివ్య.
అమెరికా కోర్టు శంకర్‌కు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, శంకర్ తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు దివ్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శంకర్ కోసం వెతకడం ప్రారంభించారు.
అయితే పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్న శంకర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ పోలీసుల వ్యవహరంపై ప్రశ్నించారు శంకర్. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడిని కిడ్నాప్ చేయలేదని, ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నాడంటూ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే తప్పించుకున్నట్లు తెలిపాడు. అయితే అరెస్ట్ చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు.