
What is mono railway : ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... దేశ ఆర్థిక రాజధాని ముంబైని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కుండపోత వర్షాల ధాటికి రోడ్డుపై నడిచే వాహనాలే కాదు ఎలివేటెడ్ ట్రాక్ పై ప్రయాణించే మోనో రైళ్ళ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. గాల్లో వేలాడుతున్నట్లుగా ఉండే ఈ రైలు సడన్ గా ట్రాక్ మధ్యలో ఆగిపోవడంతో ముంబై ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దాదాపు రెండుగంటలపాటు ఈ మోనో రైలు అలాగే ఆగిపోయింది... చివరకు అధికారులు ప్రత్యేక క్రేన్ల ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఇలా దాదాపు 400 మందిని సురక్షితంగా కాపాడారు.
ఈ ఘటనతో మోనో రైలు పేరు వెలుగులోకి వచ్చింది. సాధారణ, మెట్రో, బుల్లెట్ రైళ్ల గురించి అందరికీ తెలుసు... కానీ చాలామంది మోనో రైలు పేరును కొత్తగా వింటున్నారు. కాబట్టి అసలు ఏమిటీ మోనో రైలు? ఎలా నడుస్తుంది? దీని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా రైలు పట్టాలు అనగానే మనకు రెండు సమాంతర ఉక్కు కడ్డీలు, మధ్యలో సిమెంట్ దిమ్మెలు, వాటిమధ్యలో కంకర గుర్తుకువస్తుంది. ఇలాంటి రైలు పట్టాలే దేశవ్యాప్తంగా లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నాయి. సాధారణ రైల్వే ట్రాక్ కు భిన్నంగా మెట్రో రైల్వే వ్యవస్థలో భూమిపై కాకుండా గాల్లో పట్టాల నిర్మాణం ఉంటుంది... ఇదికూడా రెండు ఉక్కు కడ్డీలతో కూడినదే... వీటిపై మెట్రో రైలు ప్రయాణిస్తుంటుంది. కానీ మోనోరైలు ఇలాకాదు... కేవలం ఒకే ఒక్క పట్టా ఉంటుంది… ఇదే ఇతర రైళ్లతో దీన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది.
మెట్రో మాదిరిగానే భారీ పిల్లర్లతో కూడిన ఎలివేటెడ్ ట్రాక్ పై ఈ మోనో రైలు ప్రయాణిస్తుంది. కానీ మెట్రో ట్రాక్ సాధారణ రైల్వే ట్రాక్ మాదిరిగానే ఉంటుంది... కానీ ఈ మోనో ట్రాక్ వేరుగా ఉంటుంది. ఒకే ఉక్కు ట్రాక్ పై మోనో రైలు ప్రయాణిస్తుంది... కాబట్టి ఇందులో ప్రయాణించేవారికి గాల్లో తేలుతున్న ఫీలింగ్ ఉంటుంది.
సాధారణంగా రైలు ప్రయాణానికి చాలా స్థలం అవసరం అవుతుంది... మెట్రో రైలుకు కూడా రోడ్డుమధ్యలో భారీ పిల్లర్లు, వాటిపై విశాలమైన ట్రాక్ అవసరం అవుతుంది. కానీ మోనో రైలు ఇలా కాదు.. కేవలం సింగిల్ ట్రాక్ పై నడుస్తుంది కాబట్టి తక్కువ స్థలం అవసరం ఉంటుంది.
మోనో రైలు రద్దీ నగరాల్లో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం సులువుగా ఉంటుంది. కాబట్టి నగరాల్లో సాధారణ రైళ్లను నడపడానికి వీలులేని రద్దీప్రాంతాల్లో ఈ రైలును నడపవచ్చు.
మోనో రైలు భారీ లోడ్ ను కూడా మోయగలదు. అంటే ఎక్కువమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలదు. అలాగే ఇది ప్రత్యేక ట్రాక్ పై నడుస్తుంది కాబట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీనివల్ల రద్దీ తగ్గుతుంది.
పెద్ద నగరాలకు ఈ మోనో రైలు సరిగ్గా సరిపోతుంది. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకోసమే ముంబైలో ఈ రైల్వే వ్యవస్థ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.
మెట్రో రైల్ వ్యవస్థకోసం ఏర్పాటుచేసే పిల్లర్లు రోడ్డుపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాటిపై ట్రాక్ కూడా కోసం చేపట్టే నిర్మాణాలు కూడా ఎక్కువస్థలాన్ని ఆక్రమిస్తాయి. కానీ ఈ మోనో రైలు అలా కాదు.. కేవలం పిల్లర్లను అనుసంధిస్తూ సింగిల్ ట్రాక్ నిర్మిస్తే చాలు... ప్రయాణం సాగుతుంది. అంటే ఇది తక్కువస్థలాన్ని ఆక్రమిస్తుంది.
సింగిల్ ట్రాక్ పై మోనో రైలు ప్రయాణం చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి నగర అందాలను కూడా ఇది రెట్టింపు చేస్తుంది. ఇలా ప్రయాణానికే కాదు సుందరీకరణకు ఉపయోగపడుతుంది. అందుకే థీమ్ పార్కుల్లో ఈ రైళ్లను ఉపయోగిస్తారు.
భారతదేశంలో కేవలం ముంబైలో మాత్రమే ఈ మోనోరైలు వ్యవస్థ ఉంది. ప్రస్తుతం ఇది 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది... దీన్ని 19.4 కి.మీ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే ప్రపంచంలోనే పొడవైన మోనో రైలు వ్యవస్థ కలిగిన నగరంగా ముంబై మారుతుంది. ప్రస్తుతం జపాన్ లోని ఒసాకి మోనో రైల్ మొదటిస్థానంలో ఉంటే ముంబై రెండోస్థానంలో ఉంది.