Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ వెనుక ఏం జరిగింది? కేంద్రం ఇచ్చిన బిగ్ ఆఫర్ ఇదేనా?

Published : Jul 24, 2026, 09:45 AM IST

Sonam Wangchuk: నీట్ పేపర్ లీక్ వివాదం కొత్త మలుపు తిరిగింది. కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం రాత్రి తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు.

PREV
15
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ.. జంతర్ మంతర్ లో అసలేం జరుగుతోంది?

ప్రముఖ సామాజిక వేత్త, విద్యారంగ సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం రాత్రి తన 26 రోజుల నిరవధిక నిరాహార దీక్షను ముగించారు. గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జెపి నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. లేహ్ లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రమవడం, మరోవైపు వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌లతో నాలుగు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ చర్చల్లో వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని కాపాడటం ప్రధాన ప్రాధాన్యంగా భావిస్తూ, ఆయన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కేంద్రం నిర్ణయించింది.

25
కేంద్రం ఇచ్చిన కీలక హామీలు ఇవే

కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు మంత్రి జితేంద్ర సింగ్ మొదట వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్‌మోతో మాట్లాడారు. ఆ తర్వాత మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారిక హామీ పత్రాన్ని వాంగ్‌చుక్‌కు స్వయంగా అందజేశారు.

• కేసుల ఉపసంహరణ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లేదా జూలై 20న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా క్రిమినల్ చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు.

• ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు పరిహారం: నీట్ పేపర్ లీక్ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది.

• పార్లమెంట్‌లో చర్చ: పరీక్షల లీకేజీలు, విద్యా సంస్కరణలు, జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరుపుతామని హామీ ఇచ్చారు.

• కొత్త బిల్లు రూపకల్పన: పేపర్ లీకేజీలను అరికట్టేందుకు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా డోప్ట్ పరిధిలో వచ్చే వారం పార్లమెంట్‌లో కొత్త బిల్లు ప్రవేశపెడతారు.

35
స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించినట్లు ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. "సోనమ్ జీ వైద్యుల సలహాలను పాటిస్తూ, త్వరగా కోలుకుని కోరుకుంటున్నాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అంతకుముందు, ప్రధాని మోదీ మాట్లాడుతూ పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. 22 లక్షల మంది విద్యార్థులకు వేగంగా రీఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని ఆయన తెలిపారు. వచ్చే వారం పార్లమెంట్‌లో లీకేజీ నిరోధక బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

"శాంతి, శాంతి ఒక్కటే నా మార్గం. అవతలి వైపు నుంచి ఎలాంటి చర్యలు ఎదురైనా, మన సమాధానం మాత్రం పువ్వులు పంచడమే అయి ఉండాలి" అని ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

45
సోనమ్ వాంగ్‌చుక్ మెసేజ్, లడఖ్ పయనం

దీక్ష విరమించిన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ, దేశంలో ఆందోళనల సాకుతో హింస చెలరేగే అవకాశం ఉందని భావించి దీక్ష ముగిస్తున్నట్లు తెలిపారు. మన శాంతియుత పోరాటాలను కొంతమంది అసాంఘిక శక్తులు తమ స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచాలని, ఎలాంటి హింసకు తావివ్వకుండా ఓపికగా ఉండాలని నిరసనకారులను ఆయన కోరారు. లడఖ్‌కు తిరిగి వెళ్లే ముందు ఈ ఉద్యమంలో భాగమైన విద్యార్థులు, తన అనుచరులతో మాట్లాడి పరిస్థితిని వివరిస్తానని వాంగ్‌చుక్ తెలిపారు. దీక్ష విరమించడానికి ముందు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది పార్లమెంట్ సభ్యులు ఆయనను కలిసి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

55
ఆందోళనలు కొనసాగిస్తామన్న సీజేపీ

సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై కాకరోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంతోషం వ్యక్తం చేశారు. 26 రోజుల పాటు తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ మనస్సాక్షిని నిద్రలేపినందుకు వాంగ్‌చుక్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ పరిణామంతో తమ పోరాటం ఆగిపోదని అభిజీత్ స్పష్టం చేశారు.

జూన్ 20, 2026న ప్రారంభమైన ఈ ఉద్యమంలో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని సీజేపీ తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసన కొనసాగుతుందని అభిజీత్ దిప్కే ప్రకటించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో శాంతియుత నిరసనలు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories