
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అధికారిక కార్యక్రమాలైనా, పార్టీ వ్యవహారాలైనా ప్రజల వద్దకు వెళ్లేలా ప్లాన్ చేస్తారు. మరీముఖ్యంగా యువతను చైతన్యపర్చేలా మోదీ వ్యవహరిస్తుంటారు. ఇలా ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడే 'మన్ కీ బాత్' ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. తాజాగా అలాంటి అద్భుత కార్యక్రమాన్నే జాతీయ యువజన దినోత్సవం 2025 ను పురస్కరించుకుని చేపడుతున్నారు ప్రధాని. యువతను భాగస్వామ్యం చేస్తూ వారి ఆలోచనలను వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఉపయోగించుకునేలా మోదీ ప్లాన్ చేసారు.
మోదీ సర్కార్ స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం జనవరి 12 వస్తోందంటే చాలే యువతలోనూతనోత్తేజ్జాన్ని నింపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో 2025 యువజన దినోత్సవాన్ని కూడా ఇలాగే సరికొత్తగా నిర్వహిస్తోంది మోదీ సర్కార్. 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ 2025' నిర్వహిస్తున్నారు... ఇందులో భాగంగానే వికసిత్ భారత్ క్విజ్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్విజ్ ఛాలెంజ్ కు 'మై గవర్నమెంట్' పోర్టల్ వేదికయ్యింది.ఈ క్విజ్ లో 15 సంవత్సరాల నుండి 29 ఏళ్లలోను యువతీ యువకులు పాల్గొనవచ్చు. 300 సెకన్లలో అంటే 5 నిమిషాల్లో 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది... ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినవారికి నగదు బహుమతి ఇస్తారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 5, 2024 వరకు ఈ క్విజ్ కొనసాగుతోంది. ఇంగ్లీష్, హిందితో పాటు తెలుగు, మరాఠీ, కన్నడ, అస్సామీ, బెంగాలి,గుజరాతి, తమిళ్, మళయాళం, పంజాబి, ఓడియా బాషల్లో ఈ క్విజ్ అందుబాటులో వుంటుంది.
యువతకు మోదీ సందేశం :
యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్విజ్ లో పాల్గొనాలని యువతకు సూచించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. ''నా యువ స్నేహితులారా... మీ కోసం ఒక ఆసక్తికరమైన క్విజ్ సిద్ధంగా ఉంది. ఈ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా మీరు 2025 జనవరి 12న జరగనున్న చారిత్రాత్మక వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో భాగస్వాములయ్యే అవకాశం పొందుతారు. మీ సృజనాత్మక ఆలోచనలను ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో వినిపించుకునే ఈ ప్రత్యేక అవకాశం మిమ్మల్ని మరింత ఉన్నతస్థాయి దిశగా నడిపిస్తుంది. మీ ఆలోచనలు, దృక్పథం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ఉపయోగపడతాయి. ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోకండి. క్విజ్‌లో పాల్గొని, మీ సూచనలు వినిపించి, దేశ అభివృద్ధిలో మీ ముద్ర వేయండి!'' అని సూచించారు.
ఈ వికసిత్ భారత్ క్విజ్ ఛాలెంజ్ లో భారతదేశంలోని ముఖ్యమైన మైలురాళ్లు, విజయాల గురించి ప్రశ్నలు వుంటాయి. వీటిగురించి యువతకు ఉన్న అవగాహనను, జ్ఞానాన్ని ఈ క్విజ్ ద్వారా పరీక్షిస్తారు. ఈ క్విజ్ దేశ పురోభివృద్ధి, చారిత్రాత్మక ఘట్టాలు, విజ్ఞాన శాస్త్రం, సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక పురోగతిపై యువతకు అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది.
వికసిత్ భారత్ ఛాలెంజ్ క్విజ్ ప్రైజ్ మనీ ఎంతంటే...
క్విజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ₹ 1,00,000/- నగదు బహుమతి ఇవ్వబడుతుంది. రెండవ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ₹ 75,000/- నగదు బహుమతి ఇస్తారు. మూడవ ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ₹ 50,000/- నగదు బహుమతి అందుకుంటారు. ఆ తర్వాత టాప్ 100 మందిలో ఒక్కొక్కరికి ₹2,000/- కన్సోలేషన్ బహుమతులు ఇవ్వబడుతుంది. అంతేకాదు ఆ తర్వాత 200 మందిలో ఒక్కొక్కరికి ₹1,000/- అదనపు కన్సోలేషన్ బహుమతులు లభిస్తాయి. ఈ క్విజ్ లో పాల్గొనే వారందరికీ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
వికసిత్ భారత్ ఛాలెంజ్ క్విజ్ నియమనిబంధనలు :
క్విజ్ భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. మై నేషన్ పోర్టల్ లోకి వెళ్లి 'ప్లే క్విజ్'పై క్లిక్ చేయగానే క్విజ్ ప్రారంభమవుతుంది. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు భాషల్లో క్విజ్ అందుబాటులో ఉంటుంది. ఒకే పార్టిసిపెంట్ నుంచి బహుళ ఎంట్రీలు ఆమోదించబడవు. ఒకసారి ఎంట్రీ సబ్మిట్ చేస్తే దాన్ని ఉపసంహరించుకోలేరు.
అనుకోని పరిస్థితులు ఎదురైతే ఏ సమయంలోనైనా పోటీ యొక్క నియమనిబంధనలను సవరించే లేదా పరిగణనలోకి తీసుకున్న విధంగా పోటీని రద్దు చేసే హక్కు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు ఉంది. పాల్గొనేవారు క్విజ్ పోటీ యొక్క ఏవైనా సవరణలు లేదా తదుపరి నవీకరణలతో సహా అన్ని నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలి. క్విజ్ పై యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క నిర్ణయం అంతిమమైనది, దానికి అందరూ కట్టుబడి ఉండాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలు నమోదు చేయబడవు.
అన్ని వివాదాలు/ చట్టపరమైన ఫిర్యాదులు ఢిల్లీ అధికార పరిధికి లోబడి ఉంటాయి. ఇందుకు అయ్యే ఖర్చును పార్టీలే భరిస్తాయి. కంప్యూటర్ దోషం లేదా ఆర్గనైజర్ యొక్క సహేతుక నియంత్రణకు మించి మరే ఇతర దోషం కారణంగా పోయిన, ఆలస్యంగా లేదా అసంపూర్ణంగా ఉన్న లేదా ప్రసారం చేయని ఎంట్రీలకు నిర్వాహకులు ఎటువంటి బాధ్యతను స్వీకరించరు.పాల్గొనేవారు క్విజ్ తీసుకునేటప్పుడు పేజీని రిఫ్రెష్ చేయకూడదు, వారి ఎంట్రీని నమోదు చేయడానికి పేజీని సబ్మిట్ చేయాలి.
ప్రకటించిన విజేతలు తమ మైగవ్ ప్రొఫైల్లో ప్రైజ్ మనీ పంపిణీ కోసం తమ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ కోసం మైగవ్ ప్రొఫైల్ లోని యూజర్ నేమ్ బ్యాంక్ అకౌంట్ లోని పేరుతో సరిపోలాలి. పాల్గొనేవారు తమ పేరు, ఇ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్, నగరం ఇవ్వాలి. ఈ వివరాలను సమర్పించడం ద్వారా, పాల్గొనేవారు క్విజ్ యొక్క ఉద్దేశ్యం కోసం వారి ఉపయోగం కోసం సమ్మతిని ఇస్తారు.నిబంధనలు, షరతులు ఇకపై భారతీయ చట్టాలు, భారత న్యాయవ్యవస్థ తీర్పులకు లోబడి ఉంటాయి.