Indian Railway
ప్రభుత్వ పనులంటే చాలా నెమ్మదిగా జరుగుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుల్లో పూర్తికావాల్సిన పనులు నెలల్లో... నెలల్లో పూర్తికావాల్సినవి సంవత్సరాల్లో పూర్తికావడం చూసాం. కానీ వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేదంటే నమ్ముతారా! కానీ నిజంగానే అలాంటి ఓ ప్రభుత్వం ప్రాజెక్ట్ వుంది. దాని గురించి తెలుసుకుందాం.
Indian Railway
తనక్ పూర్-బాగేశ్వర్ రైలు మార్గం :
కొండప్రాంతాలను కలిగిన ఉత్తరాఖండ్ హిందూ ధార్మిక ప్రదేశాలకు ప్రసిద్ది. ఇక్కడ అనేక దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు వున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో బ్రిటీష్ కాలంలో సర్వే ప్రారంభమై ఇప్పటికీ పనులు పూర్తికాని రైల్వే ప్రాజెక్ట్ ఒకటి వుంది. అదే తనక్ పూర్-బాగేశ్వర్ రైల్వే లైన్. తాజాగా ఈ రైల్వే లైన్ సర్వే పూర్తి కావడం వార్తల్లో నిలిచింది.
ఉత్తరాఖండ్ లోని తనక్ పూర్ దేశ రక్షణ విషయంలో చాలా కీలక ప్రాంతం. ఇది చైనా,నేపాల్ దేశాల సరిహద్దుల్లో వుంటుంది. ఈ ప్రాంతాన్ని బాగేశ్వర్ తో కలుపుతూ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇలా 1882 లో ప్రారంభమైన సర్వే ఇన్నాళ్లకు పూర్తయ్యింది. దాదాపు 170 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.49 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఈ రైల్వే లైన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగివుంది. మొదట తనక్ పూర్, బాగేశ్వర్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు 1882 బ్రిటీష్ పాలకులు ప్రణాళికలు రూపొందించారు. అయితే అనేక కారణాలతో పలుమార్లు సర్వే పూర్తయినా రైలు మార్గం మాత్రం ఏర్పాటుకాలేదు. ఇలా మొత్తంగా 1882, 1912, 1980, 2006, 2008, 2009, 2012 లో అంటే ఏడుసార్లు సర్వేలు జరిగినా పనులు ముందుకు సాగలేదు. కానీ 2022-23 జరిగిన సర్వేతో ఈ రైల్వే పనులకు మోక్షం లభించింది.
Indian Railway
ఈ రైలు మార్గం ఎందుకంత ప్రత్యేకం :
తాజాగా పూర్తయిన తుది సర్వే ప్రకారం తనక్ పూర్, బాగేశ్వర్ రైల్వే మార్గంలో 12 రైల్వే స్టేషన్లు రానున్నాయి. ఇది పూర్తయితే బాగేశ్వర్, అల్మోరా, పిథోర్ ఘర్, చంపావత్ లోని కొండ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాంతాల్లో పండే పండ్లు, కూరగాయల రవాణాకు రైల్వే మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా ఆ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి అభివృద్దకి దోహదపడుతుంది.
అంతేకాదు రైల్వే మార్గం దేశ రక్షణ విషయంలోనే వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగివుంది. చైనా, నేపాల్ సరిహద్దుల వరకు సాగే ఈ రైల్వే చేరుకుంటుంది... కాబట్టి ఇది చాలా కీలకంగా మారింది. అందువల్లే 2012 లో కేంద్ర ప్రభుత్వం తనక్ పూర్, బాగేశ్వర్ రైల్వే లైన్ ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించింది.
Indian Railway
ఎందుకింత జాప్యం :
ఉత్తరాఖండ్ అంటేనే కొండ ప్రాంతాల్లో నిండివున్న రాష్ట్రం. అందులో తనక్ పూర్, బాగేశ్వర్ రైల్వే లైన్ పూర్తిగా కొండకోనల మీదుగా సాగుతుంది. అంతేకాదు నదులు, లోయలను దాటుకుంటూ ఈ మార్గాన్ని నిర్మించాలి. ఇలాంటి ప్రాంతాల్లో రైల్వే లైన్ నిర్మాణం చాలా క్లిష్టమైన పని...అందువల్లే అనేక అవాంతరాలు ఎదురై శతాబ్ద కాలంగా ఇంకా సర్వే పనులే జరుగుతున్నాయి.
ఈ రైల్వే లైన్ దూరం కేవలం 170 కిలో మీటర్లే...కానీ ఇందులో 54 కిలోమీటర్ల మేర 71 సొరంగాలను ప్రతిపాదించారు. అలాగే ఈ రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని సేకరించాల్సి వుంది...ఇందులో 27 హెక్టార్లు ప్రైవేట్ వ్యక్తులకు చెందింది. ఇలా భూసేకరణ కూడా చాలా సంక్లిష్టమైంది.
ఎలాగయితేనేం ఎట్టకేటకు తనక్ పూర్,బాగేశ్వర్ రైల్వై లైన్ తుది సర్వే పూర్తయ్యింది. రెండేళ్లపాటు సాగిన ఈ సర్వే నివేదికను స్కైలె ఇంజనీరింగ్ డిజైనింగ్ రైల్వే శాఖకు అప్పగించింది. మరి ఇప్పటికయినా ఈ మార్గంలో పనులు పూర్తయి రైలు పరుగెడుతుందేమో చూడాలి.