ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆరోగ్య సంబంధిత సమస్యలని అధికార వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు ఆయన లిఖితంగా సమర్పించారు.
25
జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతికి అందజేసిన తన రాజీనామా లేఖలో జగదీప్ ధన్‌ఖడ్ .. "భారత రాష్ట్రపతికి నా గాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పదవీ కాలంలో ఏర్పడిన సాన్నిహిత్యం, అద్భుతమైన వృత్తిపరమైన సంబంధాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. అలాగే, గౌరవనీయ ప్రధానమంత్రి, వారి మంత్రిమండలికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధానమంత్రి మోడీ సహకారం, మద్దతు ఎంతో విలువైనది. వారి నుండి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను" అని పేర్కొన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ తన లేఖలో పార్లమెంటు సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. "సభ్యుల నుండి నాకు లభించిన అభిమానం, విశ్వాసం, ఆత్మీయత నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్యంలో భాగమయ్యే అరుదైన అనుభవం" అని పేర్కొన్నారు.
35
భారత ప్రగతిలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది : జగదీప్ ధన్‌ఖడ్
"ఈ ముఖ్యమైన కాలంలో భారత అభివృద్ధి, ప్రగతిని చూస్తూ అందులో భాగస్వామ్యంగా ఉండడం నా జీవితంలో అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని దేశ చరిత్రలో ఒక మార్పు దశగా చూస్తున్నాను. ఈ స్థానాన్ని విడిచిపెడుతున్నప్పుడు, భారత భవిష్యత్తుపై నాకు అపార విశ్వాసం ఉంది" అని జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
ఆరోగ్య కారణాల వల్లే రాజీనామా
ఆరోగ్య సమస్యలే జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు ప్రధాన కారణమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. త్వరలోనే అధికారికంగా వారి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించే అవకాశం ఉంది. ఇక, కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
జగదీప్ ధన్‌ఖడ్ 1989లో జుంఝును పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు కేంద్ర మంత్రి సహాయంగా పని చేశారు. 1993-1998 మధ్య అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్‌సభ, శాసనసభ కమిటీలకు సభ్యుడిగా సేవలందించారు.
55
2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్
జగదీప్ ధన్‌ఖడ్ 2022 జూలై 18న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిని విరమించి భారత ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతిగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా, మఖన్‌లాల్ చతుర్వేది విశ్వవిద్యాలయానికి విజిటర్‌గా సేవలందించారు.