Union Budget: బ‌డ్జెట్ ముందు హ‌ల్వా వేడుక ఎందుకు చేస్తారో తెలుసా.? ఆస‌క్తిక‌ర విష‌యాలు

Published : Jan 28, 2026, 02:46 PM IST

Union Budget: బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన పార్ల‌మెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
బడ్జెట్ చుట్టూ ఉన్న ఆసక్తికర చరిత్ర, సంప్రదాయాలు

ప్రతి ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ రోజు దేశం మొత్తం ఆర్థిక నిర్ణయాలపై దృష్టి పెడుతుంది. కానీ బడ్జెట్ అంటే కేవలం లెక్కల పుస్తకం మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో ఆసక్తికర కథలు, వింత సంప్రదాయాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

26
ఒకప్పుడు సాయంత్రం వేళ బడ్జెట్ ఎందుకు వచ్చేది?

బ్రిటిష్ పాలన కాలంలో భారత బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కారణం లండన్ టైమ్. అప్పట్లో భారత్ లో 5 గంటలు అంటే లండన్ లో ఉదయం 11.30 అవుతుంది. బ్రిటిష్ పార్లమెంట్ సౌకర్యం కోసం ఈ పద్ధతి పాటించేవారు. ఈ సంప్రదాయం 1999 వరకూ కొనసాగింది. 2001లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.

36
బడ్జెట్ ముద్రణ, హల్వా వేడుక వెనుక కథ

1950కు ముందు బడ్జెట్ పత్రాలు రాష్ట్రపతి భవన్ లో ముద్రించేవారు. ఒకసారి బడ్జెట్ లీక్ కావడంతో భద్రతపై ఆందోళన మొదలైంది. అప్పటి నుంచి నార్త్ బ్లాక్ బేస్ మెంట్ లోని రహస్య బంకర్ లో బడ్జెట్ ముద్రణ జరుగుతోంది. అక్కడ పనిచేసే సుమారు 100 మంది అధికారులు 10 రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. బడ్జెట్ ముద్రణ మొదలుకాక ముందు హల్వా వేడుక నిర్వహిస్తారు. శుభకార్యం తీపితో మొదలుపెట్టాలన్న భారత సంప్రదాయానికి ఇది ప్రతీక. ఆర్థిక మంత్రి స్వయంగా హల్వా పంచడం ఆనవాయితీ.

46
చిన్న‌, పొడ‌వైన బ‌డ్జెట్ ప్ర‌సంగం

1977లో ఆర్థిక మంత్రి హీరూభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో దేశ చరిత్రలోనే అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. దానికి పూర్తి విరుద్ధంగా 2020లో నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం 2 గంటలు 42 నిమిషాల పాటు సాగింది. అది ఇప్పటివరకు అతి పొడవైన బడ్జెట్ స్పీచ్ గా నిలిచింది.

56
వింత పన్నులు, బడ్జెట్ రూపంలో మార్పులు

స్వాతంత్రం తర్వాత తొలి పదేళ్లలో భారత్ లో వింత పన్నులు ఉండేవి. క్రాస్ వర్డ్ పజిల్, పోటీల్లో గెలిచిన బహుమతులపై పన్ను, గిఫ్ట్ ట్యాక్స్, ఖర్చుపై పన్ను వంటి నిబంధనలు అమల్లో ఉండేవి. కొన్ని పన్నులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2018 వరకూ బడ్జెట్ ఎర్ర బ్రీఫ్ కేస్ లో వచ్చేది. ఇది బ్రిటిష్ సంప్రదాయం. 2019లో నిర్మలా సీతారామన్ ఆ పద్ధతిని మార్చి భారతీయ సంప్రదాయ బ్యాగ్‌ను ప్రవేశపెట్టారు.

66
తొలి బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ విలీనం వరకూ

భారతదేశ తొలి బడ్జెట్ 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి జేమ్స్ విల్సన్ దీన్ని ప్రవేశపెట్టారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ఖజానా నింపడమే లక్ష్యంగా ఆ బడ్జెట్ రూపొందింది. స్వాతంత్రం ముందు లియాఖత్ అలీ ఖాన్ ‘పేదవాడి బడ్జెట్’ ప్రవేశపెట్టారు. ఇందులో ధనవంతులపై పన్ను విధించారు. భారత చరిత్రలో ముగ్గురు ప్రధాన మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆ జాబితాలో ఉన్నారు. ఇక 1924 నుంచి విడిగా వస్తున్న రైల్వే బడ్జెట్ సంప్రదాయం 2017లో ముగిసింది. అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories