డీలిమిటేషన్ తో 272 ఎంపీ సీట్లు పెరిగితే ... మాకు 272 సీట్లు కావాల్సిందే : రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

నియోజకవర్గాల డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

Telangana CM Revanth Reddy Strong Comments on Delimitation: Demands Fair MP Seat Distribution for South India in telugu akp
Delimitation

Delimitation : భారతదేశ రాజకీయాల్లో చాలాకాలంగా ఉత్తరాది, దక్షిణాది వివాదం కొనసాగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్ల పాలనలో ఉత్తరాది రాష్ట్రాలకే అధిక నిధులు ఇస్తోందని... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల బాషా, సంస్కృతులను కూడా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మోదీ సర్కార్ పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీని ద్వారా తమ బలాన్ని పార్లమెంట్ లో పూర్తిగా తగ్గించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రకారం చేపడితే తమకు అన్యాయం జరుగుతుందనే దక్షిణాది రాష్ట్రాల వాదన. అందువల్లే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దంటూ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కీలక పార్టీల నాయకులు సమావేశమయ్యారు.  ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.  లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదనేదే తమ మొదటి డిమాండ్ అన్నారు.  ఒకవేళ చేపడితే జనాభా ప్రాతిపదికన చేపట్టరాదని కోరారు. పెరిగే ఎంపీ సీట్లలోనూ దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కాలని రేవంత్ కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గించేలా కేంద్రం ముందుకు వెళితే చూస్తూ ఊరుకోమని... అందరం కలిసి ఉద్యమిస్తామని రేవంత్ హెచ్చరించారు. 

Revanth Reddy

డీలిమిటేషన్ తో పెరిగే ఎంపీ సీట్లెన్ని? అందులో దక్షిణాది రాష్ట్రాలకు దక్కాల్సినవెన్ని? 

కేంద్ర ప్రభుత్వం లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఇప్పుడున్న సీట్లు భారీగా పెరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో 50 శాతం పెంచినా 272 సీట్లు పెరుగుతాయని... దీంతో మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్యం 815 కు చేరుకుంటుందని రేవంత్ అన్నారు. 

అయితే ప్రస్తుత లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 130 సీట్లు మాత్రమే ఉన్నాయని... ఇది కేవలం 24 శాతమేనని రేవంత్ తెలిపారు. న్యాయంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభలో 33 శాతం వాటా ఉండాలన్నారు. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎన్ని సీట్లు పెంచినా అందులో 33 శాతం దక్షిణాది రాష్ట్రాలకు దక్కాల్సిందేనని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. 

డీలిమిటేషన్ తో లోక్ సభ సీట్లు 815 కు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు 272 సీట్లు ఇవ్వాలని రేవంత్ కోరారు. అంటే ఎన్ని లోక్ సభ సీట్లయితే పెరుగుతాయో అందుకు సమానంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరిల‌ సీట్లు ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. 

తమకు న్యాయంగా దక్కాల్సిన ఎంపీ సీట్లు కేటాయించాక మిగతా సీట్లను ఉత్త‌రాది, ఇత‌ర రాష్ట్రాల‌కు కేంద్రం త‌మ అభిమ‌తం మేర‌కు పంచ‌వ‌చ్చని రేవంత్ అన్నారు. అనుకున్న దానికంటే ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సీట్ల సంఖ్య త‌గ్గిస్తే అది దేశ రాజ‌కీయ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుందన్నారు. 

 బీజేపీ ప్ర‌తిపాదిస్తున్న జ‌నాభా దామాషా ప‌ద్ద‌తిలో పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ద‌క్షిణాది రాష్ట్రాలు రాజ‌కీయ గ‌ళం కోల్పోతాయన్నారు. ఉత్త‌రాది ఆధిపత్యం పెరిగి దక్షిణాది ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోవాల్సి వస్తుందన్నారు. జ‌నాభా ప్రాతిపదిక‌న పున‌ర్విభ‌జ‌న చేప‌డితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, ఛత్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిప‌త్యం చ‌లాయిస్తాయ‌న్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ ను అంగీక‌రించ‌కూడ‌దు... బీజేపీ అనుస‌రిస్తున్న విధానానికి వ్య‌తిరేకంగా ద‌క్షిణాది పార్టీలే కాదు ప్ర‌జ‌లు కూడా ఏకం కావాలని రేవంత్ రెడ్డి సూచించారు. 


Delimitation Meeting

నిధుల పంపిణీలోనూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే : రేవంత్ రెడ్డి 

1971లో జ‌నాభాను నియంత్రించాల‌ని దేశం నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టి నుంచి ద‌క్షిణాది రాష్ట్రాలు దాన్ని అమ‌లు చేస్తోంది ... కానీ ఉత్త‌రాదిలోని పెద్ద రాష్ట్రాలు జ‌నాభా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి... జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం, వేగంగా ఉద్యోగాల క‌ల్ప‌న‌,  మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, సుప‌రిపాల‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో మంచి ప్ర‌గ‌తి సాధించాయన్నారు. 

అయితే దేశ ఖ‌జానాకు మ‌నం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ త‌క్కువ మొత్తాన్ని పొందుతున్నాయన్నారు రేవంత్. త‌మిళ‌నాడు ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైస‌లే వెన‌క్కి వ‌స్తుంటే... ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు రూపాయికి రెండు రూపాయ‌ల 73 పైస‌లు వెన‌క్కి వెళుతున్నాయన్నారు. బీహార్‌ రూపాయి చెల్లిస్తే 9 రూపాయ‌ల 22 పైస‌లు వెన‌క్కి తీసుకుంటుంటే క‌ర్ణాట‌క‌కు కేవ‌లం 14 పైస‌లు, తెలంగాణ‌కు 41 పైస‌లు, కేర‌ళ‌కు 62 పైస‌లు మాత్ర‌మే వెన‌క్కి వ‌స్తున్నాయన్నారు. అదే స‌మ‌యంలో మ‌ధ్య ప్ర‌దేశ్ రూపాయి ప‌న్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెన‌క్కి రూ.2.79 పైస‌లు వెళుతున్నాయని రేవంత్ తెలిపారు.

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్రం నిధుల కేటాయింపులు, ప‌న్ను చెల్లింపులు క్ర‌మంగా త‌గ్గిస్తోందన్నారు. చివ‌ర‌కు జాతీయ ఆరోగ్య మిష‌న్ కేటాయింపుల్లోనూ ఉత్త‌రాది రాష్ట్రాల‌కే 60 నుంచి 65 శాతం నిధులు ద‌క్కుతున్నాయన్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ నిధులు వస్తున్నాయన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!