సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వార్త వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. అసలు ఆ వార్త నిజమో, కాదో కూడా తెలియని రోజులు వచ్చేశాయ్. నెట్టింట వైరల్ అయ్యే చాలా వరకు వార్తల్లో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మొదట్లో ఈ వార్త చదివి సంతోషించిన నెటిజన్లు, చివరికి ఉత్తుత్తి న్యూస్ అని తెలుసుకొని ఉసూరుమన్నారు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడి ట్రాఫిక్. రోడ్డుపై ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటి ట్రాఫిక్‌లో మీ ప్రేయసి లేదా ప్రియుడితో ఎంచక్కా ఏసీ కారులో అది కూడా ఫుల్ ప్రైవసీతో వెళ్తే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే థ్రిల్‌గా ఉంది కదూ! స్మూచ్ క్యాబ్స్ అనే పేరుతో ఓ కొత్త క్యాబ్ సేవలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవి కేవలం ప్రేమజంటల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు నెట్టింట ప్రచారం జరిగింది.
ఓలా, ఉబెర్‌లా మిగతా క్యాబ్‌లా కాకుండా, ప్రేయసి ప్రియుడు కలిసి ప్రశాంతంగా, రొమాంటిక్‌గా టైం స్పెండ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయంటూ ప్రచారం జరిగింది. ఈ సర్వీస్ గురించి తెలిసిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే నిజానికి ఇలాంటి క్యాబ్ అనేదే లేదు ఇది కేవలం ఫన్ కోసం చేసిన ప్రచారం మాత్రమే. ‘Schmooze’ అనే మీమ్ బేస్డ్ డేటింగ్ యాప్ నుంచి ఈ ఫేక్ ప్రచారం మొదలైంది. అయితే ఇది నిజమైన సర్వీస్ కాదన్న విషయం ఆలస్యంగా బయటపడింది. చాలా మంది నమ్మిపోయి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ఈ విషయం వైరల్ అయ్యింది.
అసలు ఎలా మొదలైంది.?
ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో చేసిన పోస్ట్ తర్వాత ఈ వార్త వైరల్ అయ్యింది. "బెంగళూరులోని ఓ స్టార్ట్‌అప్ ‘స్మూచ్ క్యాబ్స్’ అనే సర్వీస్‌ను ప్రారంభించిందట. ఇది ప్రేమజంటల కోసం ప్రత్యేకంగా తయారు చేశారట, వీళ్లు అందులో ప్రైవేట్ టైం గడిపొచ్చట. త్వరలోనే ఢిల్లీలో 'హగ్ ఆటోస్' కూడా వస్తాయోమో' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత ఈ వార్తలో నిజం లేదని కేవలం ఒక ప్రచారం మాత్రమే అని తర్వాత తెలిసింది.