Shakuntala Railways: దేశంలో ప్రైవేట్ యాజ‌మాన్యంలో న‌డిచే ఏకైక‌ రైల్వే లైన్ ఇదే

Published : Nov 06, 2026, 03:38 PM IST

Shakuntala Railways: భారతదేశంలో రైల్వే వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని తెలిసిందే. అయితే ఒక రైల్వే లైన్ మాత్రం ఇప్పటికీ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతోంది. అసలేంటీ రైల్వే లైన్‌.? ఇప్పటికీ ప్రైవేట్ యాజమాన్యంలో ఎందుకు ఉంది?

PREV
15
బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన శకుంతల రైల్వేస్

శకుంతల రైల్వే చరిత్ర 1910లో ప్రారంభమైంది. అప్పట్లో బ్రిటిష్ సంస్థ కిలిక్-నిక్సన్ (Killick-Nixon) ఈ రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (CPRC) పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం పత్తి సాగుకు ప్రసిద్ధి. ఇక్కడ పండించే పత్తిని రైళ్ల ద్వారా రవాణా చేసి, చివరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు తరలించాలన్నది అప్పటి ప్రధాన ఉద్దేశం. ఈ అవసరం కోసమే రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టారు. 1916 నాటికి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలుత పత్తి రవాణాకే ఉపయోగించిన ఈ రైల్వే మార్గం, ఆ తర్వాత ప్రయాణికుల రవాణాకు కూడా అందుబాటులోకి వచ్చింది. అలా శకుంతల రైల్వేస్ ప్రజలకు పరిచయమైంది.

25
దేశమంతా జాతీయం చేసినా.. ఈ రైల్వే మాత్రం ప్రైవేట్ చేతుల్లోనే

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1952లో దేశంలోని రైల్వే వ్యవస్థను ప్రభుత్వం జాతీయం చేసింది. దీంతో ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉన్న అనేక రైల్వే మార్గాలు భారతీయ రైల్వేలో విలీనమయ్యాయి. అయితే శకుంతల రైల్వే లైన్ మాత్రం ప్రైవేట్ యాజమాన్యంలోనే కొనసాగింది. దీనికి ప్రధాన కారణం అప్పటి జాతీయీకరణ ప్రక్రియలో ఈ మార్గం ప్రభుత్వ ఆధీనంలోకి రాకపోవడమేనని చెబుతారు. ఈ రైల్వే లైన్ యాజమాన్యం ఇప్పటికీ సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (CPRC) చేతుల్లోనే ఉంది. ఈ సంస్థను మొదట ఏర్పాటు చేసిన కిలిక్-నిక్సన్ సంస్థ కూడా కాలక్రమంలో భారతీయుల చేతుల్లోకి మారింది. అయితే రైళ్ల నిర్వహణ మాత్రం భారతీయ రైల్వే ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అంటే పట్టాలు ఒక ప్రైవేట్ సంస్థకు చెందినవి కాగా, వాటిపై రైళ్లను నడిపించే బాధ్యత భారతీయ రైల్వే తీసుకుంటోంది. ఈ ప్రత్యేక ఒప్పందం కారణంగానే శకుంతల రైల్వే ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు పొందింది.

35
100 ఏళ్ల చరిత్ర.. ఆవిరి ఇంజిన్ నుంచి డీజిల్ రైలు వరకు

శకుంతల ఎక్స్‌ప్రెస్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఈ రైలును ఆవిరి ఇంజిన్‌తో నడిపించేవారు. 1921లో మాంచెస్టర్‌లో తయారైన ZD తరహా ఆవిరి ఇంజిన్‌ను 1923లో ఈ మార్గంలో ఉపయోగించడం ప్రారంభించారు. దాదాపు 70 ఏళ్లకు పైగా ఈ ఇంజిన్‌ను ఉప‌యోగించారు. చివరకు 1994 ఏప్రిల్ 15న ఆవిరి ఇంజిన్‌కు స్వస్తి పలికి, దాని స్థానంలో డీజిల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి డీజిల్ ఇంజిన్‌తోనే రైళ్లు నడుస్తున్నాయి. గతంలో ఈ రైలుకు మరో విచిత్రమైన ప్రత్యేకత కూడా ఉండేది.

రైల్వే స్టేషన్లలో ఆగడమే కాకుండా, ప్రయాణికులు ఎక్కడైనా చేయి ఊపితే అక్కడ కూడా రైలును ఆపేవారని అప్ప‌టి ప్రయాణికులు గుర్తుచేసుకుంటారు. ప్రస్తుతం ఈ రైల్వే మార్గం సెంట్రల్ రైల్వే పరిధిలోని భుసావల్ డివిజన్‌లో ఉంది. రైల్వే శాఖ ఈ మార్గంలో రైళ్లను నడుపుతుండగా, పట్టాల నిర్వహణ బాధ్యత మాత్రం వాటి యజమాని అయిన CPRCపై ఉంటుంది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రతి పదేళ్లకోసారి పునరుద్ధరించే అవకాశం ఉంది. స్వాతంత్రం తర్వాత ఈ ఒప్పందాన్ని పలుమార్లు పొడిగించారు.

45
190 కిలోమీటర్ల ప్రయాణం..

మహారాష్ట్రలోని మూర్తజాపూర్ నుంచి రెండు వైపులుగా ఈ రైల్వే మార్గం విస్తరించింది. మూర్తజాపూర్ నుంచి యవత్మాల్ వరకు 113 కిలోమీటర్లు, మూర్తజాపూర్ నుంచి అచల్‌పూర్ వరకు 76 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్లు ఉన్నాయి. మొత్తం దూరం దాదాపు 190 కిలోమీటర్లు. భారతదేశంలోని చాలా రైల్వే మార్గాలు బ్రాడ్‌గేజ్‌లోకి మారిపోయినా, శకుంతల రైల్వే మాత్రం చాలాకాలం నారో గేజ్ పట్టాలపైనే కొనసాగింది. ఈ మార్గంలో రోజుకు ఒక రౌండ్ ట్రిప్ మాత్రమే ఉండేది. మొత్తం ప్రయాణానికి దాదాపు 20 గంటల సమయం పట్టేదంటా. ఈ రైలు వేగం గంటకు సగటున 20 కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ స్థానిక గ్రామాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. మూర్తజాపూర్ నుంచి యవత్మాల్‌కు బస్సులో వెళ్లాలంటే కొన్ని గంటలే పట్టినా, దాదాపు రూ.150 వరకు ఖర్చవుతుంది. అదే రైలులో ప్రయాణిస్తే ఆ ఖర్చులో ఆరో వంతు మాత్రమే అవుతుందని స్థానికులు చెబుతారు. అందుకే ఈ ప్రాంతంలోని పేద ప్రజలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రయాణికులకు శకుంతల ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైన రవాణా సాధనంగా మారింది.

55
బ్రాడ్‌గేజ్‌గా మారనున్న రైల్వే లైన్..

కాలం మారుతున్న కొద్దీ రైల్వే వ్యవస్థలోనూ ఆధునిక మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శకుంతల రైల్వే మార్గాన్ని కూడా ఆధునికీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. యవత్మాల్–మూర్తజాపూర్–అచల్‌పూర్ నారో గేజ్ రైల్వే మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చేందుకు రూ.1,500 కోట్ల నిధులు మంజూరైనట్లు అప్పట్లో ప్రకటించారు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories