రూ.675 కోట్లతో దేశంలోనే తొలి ప‌బ్లిక్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం, ఇక 15 నిమిషాల్లోనే

Published : Nov 06, 2026, 02:47 PM IST

Ropeway: దేశంలో మ‌రో కొత్త ప్రయాణ సౌక‌ర్యం అందుబాటులోకి రానుంది. వార‌ణాసిలో దేశంలోనే తొలిసారిగా ప్రజా రవాణా కోసం నిర్మిస్తున్న రోప్‌వే ప్రాజెక్టు త్వ‌ర‌లోనే ప్రారంభంకానుంది. రూ. 675 కోట్ల‌తో చేప‌డుతోన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు.

PREV
15
దేశంలోనే తొలి పబ్లిక్ రవాణా రోప్‌వే

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ) పురాతన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఇరుకైన రహదారులు, నిత్యం రద్దీగా ఉండే వీధుల కారణంగా ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు ప్రధాన ఆలయాలు, ఘాట్లకు వెళ్లేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే ప్రాజెక్టును చేపట్టారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో ప్రజా రవాణా కోసం ఉపయోగించే తొలి రోప్‌వేగా గుర్తింపు పొందనుంది. నగరంలోని రద్దీ రహదారులతో సంబంధం లేకుండా ఆకాశమార్గంలో ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

25
45 నిమిషాల ప్రయాణం 15 నిమిషాల్లోనే

ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ప్రస్తుతం వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి గోదౌలియా చౌక్ వరకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌ను బట్టి సుమారు 45 నిమిషాలు పడుతోంది. అదే రోప్‌వే ద్వారా ఈ దూరాన్ని కేవలం 15 నుంచి 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం 4.2 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రహదారులపై వాహనాల రద్దీతో సంబంధం లేకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకునే వీలుంటుంది. దీనివల్ల స్థానిక ప్రజలతో పాటు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే భక్తులు, పర్యాటకులకు కూడా ప్రయోజనం కలగనుంది.

35
ఐదు స్టేషన్లు.. 220 కేబుల్ కార్లు

ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 220 కేబుల్ కార్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేబుల్ కారులో గరిష్ఠంగా 10 మంది ప్రయాణించవచ్చు. ఇవి సుమారు 45 మీటర్ల ఎత్తులో ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ రోప్‌వే మార్గంలో వారణాసి కంటోన్మెంట్, కాశీ విద్యాపీఠ్, రథయాత్ర, గిర్జాఘర్, గోదౌలియా చౌక్ స్టేష‌న్లు ఉన్నాయి. వీటి ద్వారా నగరంలోని కీలక ప్రాంతాలకు ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చు. స్టేషన్లలో లిఫ్టులు సహా ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వృద్ధులు, ఇతర ప్రయాణికులకు కూడా రోప్‌వే ప్రయాణం సౌకర్యవంతంగా ఉండనుంది.

45
రూ.675 కోట్లతో భారీ ప్రాజెక్టు

వారణాసి రోప్‌వే నిర్మాణానికి సుమారు రూ.675 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. సుమారు 4.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పు తీసుకురానుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 20 శాతం నిధులు సమకూర్చేలా వ్యయ భాగస్వామ్య విధానాన్ని రూపొందించారు. మిగిలిన నిధులను ప్రాజెక్టు ఆర్థిక ప్రణాళికలో భాగంగా సమకూర్చనున్నారు.

55
భక్తులు, పర్యాటకులకు ఎంతో ప్రయోజనం

వారణాసికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయం, దశాశ్వమేథ ఘాట్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు చేరుకుంటారు. రోప్‌వే అందుబాటులోకి వస్తే వీరికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రహదారులపై వాహనాల సంఖ్య తగ్గేందుకు కూడా ఇది దోహదపడుతుంది. ప్రయాణికుల రవాణాతో పాటు వస్తువుల తరలింపునకు కూడా ఈ వ్యవస్థను ఉపయోగించే అవకాశాలను ప్రాజెక్టు ప్రణాళికలో ప్రస్తావించారు.

మొత్తంగా వారణాసిలో చేపట్టిన ఈ రోప్‌వే ప్రాజెక్టు దేశంలో ప్రజా రవాణాకు సరికొత్త దిశ చూపనుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ఇతర నగరాల్లోనూ ఇలాంటి రోప్‌వే వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ఇది మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories