దేశవ్యాప్తంగా కలకలం రేపి నోట్ల రద్దుకు ఏడేళ్లు.. ఫలితం దక్కిందా ?

First Published | Nov 8, 2023, 11:19 AM IST

2016 నవంబర్ 8, రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోడీ ఒక్కసారిగా ఈ నోట్ల రద్దును ప్రకటించారు. అర్థరాత్రి నుంచే దేశంలో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. 

ఢిల్లీ : నోట్ల రద్దు.. డిమానిటైజేషన్…దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నోట్ల రద్దుకు నేటికీ సరిగ్గా ఏడేళ్లు.  2016,  నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించారు. 

ముందస్తుగా ఎలాంటి హింట్స్ లేకుండా ఒక్కసారిగా.. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక ప్రతి ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నోట్ల రద్దు ప్రకటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చలు హోరెత్తాయి.  


2016 నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని మోడీ ఒక్కసారిగా ఈ నోట్ల రద్దు ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి దేశంలోని అప్పటివరకు చలామణిలో ఉన్న రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తరువాత రూ. 1000, 500 నోట్ల స్థానంలో కొత్తగా రూ. 2000, కొత్త రూ.500 నోటును ప్రవేశ పెడుతున్నట్టుగా  ప్రకటించారు.

దేశంలోని నల్లధనాన్ని బయటికి తీయడానికే ఈ చర్య చేపట్టినట్టుగా తెలిపారు. కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఏమి కనిపించలేదు. రద్దు చేసిన రూ.1000, 500 నోట్లను మార్పిడి చేసుకోవడం కోసం గడువు కూడా ఇచ్చారు. అది కూడా చాలా పరిమితంగా.. రోజుకు కొంత మొత్తాన్ని మాత్రమే మార్చుకోవడానికి వీలు కల్పించారు. 

దీంతో ప్రజలు గగ్గోలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిచ్చాయి. బ్యాంకుల వద్ద అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు. నోట్ల మార్పిడి చేసుకునే క్రమంలో క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగు చూశాయి. రద్దయిన నోట్లో అనుకున్న గడువుకి 98 శాతానికి పైగా వెనక్కి వచ్చేసాయి. 

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా నల్లధనం ఏమో కానీ.. నకిలీ నోటను అరికట్టేందుకు మాత్రం ఈ ప్రక్రియ కొంత భాగం ఉపయోగపడింది. అంతకుముందు వెయ్యి రూపాయల నోట్లలో నకిలీవి పెద్ద మొత్తంలో చలామణి అయ్యేవి. ఇది కట్టడి అయింది.

ఆ తర్వాత ప్రవేశపెట్టిన నోట్లన్నీ చిత్రవిచిత్రమైన రంగులతో రెయిన్బో కలర్స్ ను తలపించాయి. దేశంలో తొలిసారిగా పింక్ కలర్ తో 2000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. కొత్త మహాత్మాగాంధీ సిరీస్ నోట్లుగా రూ. 2000, రూ.500లను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 200 రూపాయల నోటును  కొత్తగా తీసుకొచ్చింది. 

రూ. 100, 50, 20,10 నోట్లు కూడా రకరకాల రంగుల్లో కొత్త ముద్రణలో అందుబాటులోకి వచ్చాయి. పెద్ద నోటు అని చెబుతూ వెయ్యి రూపాయలను రద్దుచేసి రూ.2000 ప్రవేశపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, పెద్ద పెద్ద లావాదేవీలకు ఉపయుక్తంగా ఉంటుందని ఇది ప్రవేశపెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. 

అయితే, ఏడేళ్ల తర్వాత ఇటీవల తాజాగా మరోసారి డీమానిటైజేషన్ ప్రకటించి మరో షాక్ ఇచ్చారు. 2023 మే 19న ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస నోట్ల రద్దుకు సంబంధించి మరో సంచలన ప్రకటన చేశారు. రూ.2000 నోట్లను కూడా చలామణి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటన చేశారు.

2016 డిమానిటైజేషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ప్రజలకు ఇది మరోసారి షాక్ లాగా తగిలింది. తమ దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లు మార్చుకునేందుకు అక్టోబర్ 7 వరకు గడువు విధించింది. ప్రస్తుతం ఈ గడువు కూడా ముగిసిపోయింది. 

Latest Videos

click me!