
Sukanya Samriddhi Yojana : రాతి యుగం నుండి రాకెట్ యుగానికి చేరుకున్నాడు మనిషి. ఆ ఆటవిక కాలంనుండి ఈ ఆధునిక కాలానికి చేరుకునే పరిణామక్రమంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇలా మహిళల పరిస్థితి కూడా చాలా మారింది... ఒకప్పుడు ఒంటింటికే పరిమితమైన మగువలు ఇప్పుడు మగాళ్లతో సమానస్థాయికి చేరుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు... ఇలా అదీఇదని కాదు ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు. ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నారు.
అయితే కాలం ఎంత మారినా కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ మహిళను భారంగానే భావిస్తుంటారు. లింగ వివక్ష చూపిస్తూ మగపిల్లలను చదవించడం, ఉద్యోగాలు చేయిస్తూ... ఆడపిల్లలను ఇంటి పనులకు పరిమితం చేసే అనేక కుటుంబాలు మన సమాజంలో కనిపిస్తుంటాయి. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఆడపిల్లకు పెళ్లిచేసి భారం దింపుకుందామా అనుకునే తల్లిదండ్రులు వున్నారు. చివరకు ఆడబిడ్డ అని తెలిస్తే కడుపులో పిండాన్ని, పురిటి బిడ్డను చంపిన సంఘటనలు అనేకం.
అయితే ఆడపిల్లలపై వివక్షకు ప్రధాన కారణం వారి పెళ్లి ఖర్చు. అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలని, అబ్బాయి అయితే కట్నం వస్తుందనే భావన సమాజంలో బలంగా పాతుకుపోయింది. అలాగే అమ్మాయిల చదువును కూడా కొందరు భారంగా భావిస్తుంటారు. ఇలా అమ్మాయిలను తల్లిదండ్రలు భారంగా కాకుండా వరంగా భావించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసమే భాగంగానే ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ది యోజన స్కీం ను తీసుకువచ్చింది నరేంద్ర మోదీ సర్కారు.
ఏమిటీ పథకం :
ఆడపిల్లలకు అండగా భారత ప్రభుత్వం 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదంతో అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే అమ్మాయిల చదువు, పెళ్లి వంటివి తల్లిదండ్రుల భారంగా బావించకూడదనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన ఈ పథకాన్ని అమ్మాయిల తల్లిదండ్రులు ఏదయినా గుర్తింపుపొందిన బ్యాంకులు, పోస్టాఫిసుల ద్వారా పొందవచ్చు.
అమ్మాయి చిన్నపుడే తల్లిదండ్రులు ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ పొదుపు ఖాతా తెరిచి అందులో ప్రతినెలా కొంతమొత్తంలో డబ్బులు పొదుపు చేయవచ్చు. ఇలా 18 ఏళ్ల పాటు ప్రతినెలా కొంతమొత్తం పొదుపుచేస్తే... సరిగ్గా మీ అమ్మాయి చదువు లేదంటే పెళ్లి సమయంలో భారీ మొత్తంలో రిటర్న్స్ పొందవచ్చు.
ఇలా ఓ జంటకు ఇద్దరు ఆడపిల్లలుంటే ఇద్దరి పేరిటా సుకన్య సమృద్ది యోజన కింద పొదుపు చేయవచ్చు. అంతకంటే ఎక్కువమంది ఆడపిల్లలుంటే ఈ పథకం వర్తించదు. అయితే కవల పిల్లలను కలిగిన తల్లిదండ్రులకు కాస్త మినహాయింపు వుంటుంది.
ఈ పథకంలో ఎలా చేరాలి ?
సుకన్య యోజన సమృద్ది యోజన పథకం కింద డబ్బులు పొదుపు చేయాలనుకునే పేరెంట్స్ సమీపంలోని బ్యాంకు లేదంటే పోస్టాఫీసును సందర్శించండి. అక్కడ సుకన్య సమృద్ది యోజన ఫారం అందుబాటులో వుంటుంది. అందులో అడిగిన సమాచారాన్ని ఇవ్వండి. అలాగే ఆమ్మాయి భర్త్ సర్టిఫికేట్, ఏదయినా గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి), నివాస రుజువు పత్రాలు జతచేసి అందించాలి.
ప్రయోజనాలు :
బ్యాంకు లేదా పోస్టాఫీస్ సిబ్బంది మీ దరఖాస్తును స్వీకరించి అన్ని సరిగ్గా వున్నాయంటే ఓ పొదుపు ఖాతాను ఓపెన్ చేస్తారు. ఇందులో ప్రతినెలా కొంతమొత్తం జమ చేయాలి. కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 లను ప్రతి నెలా జమ చేయవచ్చు. ఇలా 15 ఏళ్లపాటు పొదుపు చేయాలి... 21 ఏళ్ల తర్వాత మనం డబ్బులను పొందవచ్చు. అసలుతో పాటు భారీ వడ్డీ కలిసి మనకు తిరిగివస్తుంది.
ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈ పథకం ద్వారా అధిక రాబడి పొందవచ్చు. అంటే మనం దాచుకున్న డబ్బులకు ఏడాదికి 8 శాతానికి పైగా వడ్డీ వస్తుంది. ఈ పథకంలో చేరే సమయంలో అమ్మాయిల వయసు పదేళ్లలోపు వుండాలి... అంటే పదేళ్లలోపు ఏ వయసులో అయినా పొదుపు ఖాతా తెరవచ్చు. ఏదయినా అవసరాల కోసం 18 ఏళ్ల తర్వాత కొంతమొత్తంలో డబ్బులు పొందవచ్చు.
సుకన్య ఖాతాలో పొదుపుచేసిన డబ్బులతో పాటు వడ్డీకి కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే డబ్బులకు కూడా ఎలాంటి ట్యాక్స్ వుండదు. ఇలా సుకన్య పథకం ద్వారా డబ్బులు పొదుపుచేసి పన్నులనుండి మినహాయింపు పొందవచ్చు.
ఎంత పొదుపు చేస్తే ఎంతొస్తుంది :
సుకన్య సమృద్ది యోజన పథకంలో ప్రతినెలా రూ.250 నుండి రూ.1,50,000 వరకు పొదుపు చేయవచ్చు. అయితే మీరు ఎంత పొదుపు చేస్తే మెచ్యూరిటీ సయానికి ఎంత వస్తుందో కొన్నిలెక్కలు చూద్దాం.
ప్రతినెలా వెయ్యి జమచేస్తే :
మీ కూతురు భవిష్యత్ కోసం తెరిచిన సుకన్య ఖాతాలో ప్రతినెలా వెయ్యి రూపాయలు జమ చేసారనుకొండి సంవత్సరానికి రూ.12 వేలు అవుతుంది. 15 సంవత్సరాలకు రూ.1,80,000 జమ అవుతాయి. వడ్డీ దాదాపు 3 లక్షలకు పైగా వస్తుంది. మొత్తంగా మెచ్యూరిటీ సమయానికి మీరు రూ.5 లక్షలకు పైగా డబ్బులు పొందవచ్చు.
ఇలా ప్రతి నెలా రెండువేలు జమచేస్తే దాదాపు రూ.10 లక్షలు, మూడువేలు జమచేస్తే దాదాపు రూ.15 లక్షలు, నాలుగువేలు జమచేస్తే దాదాపు రూ.20 లక్షల వరకు పొందవచ్చు. ఇక ప్రతినెలా ఐదువేలు జమ చేసారనుకొండి ఏడాదికి రూ.60 వేలు, 15 ఏళ్లకు రూ.9 లక్షలు జమ అవుతాయి. వడ్డీతో కలుపుకుంటే మెచ్యూరిటీ సమయానికి రూ.25 లక్షల వరకు పొందవచ్చు. అయితే ప్రభుత్వం వడ్డీరేట్లలో మార్పులు చేస్తే ఈ లెక్కల్లో మార్పులు వుంటాయి.