బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కి వచ్చారు. ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. కాగా, షేక్ హసీనా ప్రయాణం ఎటువైపో ఈరోజు (ఆగస్టు 6) తేలిపోనుంది. నిన్న (ఆగస్టు 5) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో షేక్ హసీనా ఢిల్లీలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో దిగారు. పరిస్థితిని అంచనా వేయడానికి సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం పొందే వరకు బంగ్లాదేశ్ ప్రధాని భారత్‌లోనే ఉంటారని బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
ఢిల్లీలో WHO రీజినల్ డైరెక్టర్‌గా హసీనా కుమార్తె
ఢిల్లీకి వచ్చిన షేక్ హసీనా తన కూతురు సైమా వాజెద్‌ను హిండన్ ఎయిర్ బేస్‌లో కలిశారు. సైమా ఢిల్లీలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజినల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇకపై బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి రానని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ స్పష్టం చేశారు.
స్పందించని భారత విదేశాంగ శాఖ
కాగా, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలపై భారత్ మౌనం వహిస్తోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. షేక్ హసీనా తదుపరి ప్రయాణ గమ్యాన్ని కేంద్రం స్పష్టం చేయలేదు.
పాకిస్థాన్ ప్రభావం
బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలగడం, ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితుల వెనుక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ పాత్ర ఉందని అంచనా. ఆఫ్ఘనిస్థాన్ తర్వాత బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న పాకిస్థాన్ ప్రభావంపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. అదే సమయంలో, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వం వహించాలని అక్కడి విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.
తారాస్థాయికి అల్లర్లు
బంగ్లాదేశ్‌లో క్రూరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. విస్తృతంగా దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. అల్లర్ల తర్వాత 24 గంటల్లో 135 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 300కి పైగా మరణాలు అల్లర్ల కారణంగా జరిగినట్లు సమాచారం. అదే సమయంలో షేక్ హసీనా ఢిల్లీలో ఉంటున్నారు. బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం పొందే వరకు ఆమె భారత్‌లోనే ఉంటారని సమాచారం.
భారత్ హై అలర్ట్
బంగ్లాదేశ్‌లో పరిస్థితులను భారత్ కొన్ని రోజులుగా సునిశితంగా పరిశీలిస్తోంది. సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయడంతో అలర్ట్ అయింది. హసీనా భారత్ వస్తారన్న సమాచారం అందడంతో ఇండియన్ ఫోర్సెస్ మరింత అలర్ట్ అయ్యాయి. గగనతలంపై నిఘా వేసి.. హసీనా వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా చేరుకునే వరకు గట్టి భద్రత కల్పించారు.