కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ భర్త, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హరియాణాలో జరిగిన భూ లావాదేవీకి సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈ విచారణకు ఆయన తన నివాసం నుంచి నడుచుకుంటూ న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈడీ ప్రకారం 2008లో రాబర్ట్ వాద్రా స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గుర్గావ్ జిల్లా షికోపూర్ ప్రాంతంలో 3.5 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాత కొద్ది నెలల్లోనే అదే భూమిని DLF (Delhi Land & Finance) అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ. 58 కోట్లకు విక్రయించింది. అంటే కొనుగోలు ధరతో పోలిస్తే భారీ లాభానికి విక్రయించింది. ఈ లావాదేవీలో అనేక అనుమానాలు ఉండటంతో ఆర్థిక మోసాల నిరోధక చట్టం కింద అధికారులు విచారణ ప్రారంభించారు.
23
Businessman Robert Vadra. (Photo/ANI)
ఈనెల 8న మొదటిసారి ఈడీ సమన్లు పంపినప్పటికీ, వాద్రా హాజరుకాలేదు. ఈక్రమంలోనే మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేస్తూ.. తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు అందిన అనంతరం వాద్రా తన నివాసం ఈడీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... "ఈ కేసులో ఎలాంటి అక్రమం లేదు. నేను అధికారులకు సహకరిస్తాను. ఇది స్పష్టంగా రాజకీయ ప్రతీకారం. రాహుల్ గాంధీని పార్లమెంటులో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ప్రతిసారి నేను ప్రజల తరపున గొంతెత్తినప్పుడు, నన్ను అణచడానికి ప్రయత్నిస్తారు. గత 20 ఏళ్లలో 15 సార్లు సమన్లు అందాయి. ప్రజలు నన్ను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు" అని రాబర్ట్ వాద్రా అన్నారు.
33
Businessman Robert Vadra (Photo/ANI)
ఈడీ చర్యలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. ఇది మోదీ ప్రభుత్వ ప్రతీకార ధోరణికి నిదర్శనం అని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే రాబర్ట్ వాద్రాపై ఇదివరకూ కూడా పలు ఆస్తుల కేసులు, ల్యాండ్ డీల్స్‌కు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు మూడేళ్ల క్రితమే లండన్‌లోని ఓ విదేశీ ఆస్తిపై కూడా విచారణ జరిగింది. ఈడీ ఇప్పటికే పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మరి రాబర్ట్ వాద్రా కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.