Raj Shamani: ఒకప్పుడు చిన్న వ్యాపారంతో ప్రయాణాన్ని ప్రారంభించిన ఓ యువకుడు.. నేడు ప్రపంచ నంబర్ వన్ యూట్యూబ్ పాడ్‌కాస్టర్‌గా ఎదిగాడు. అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖులను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతనెవరో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
సోషల్ మీడియా వచ్చాక ఎంతోమంది తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా తమ ఆలోచనలను, అనుభవాలను కోట్లాది మందికి చేరవేస్తున్నారు. అలాంటి వారిలో భారతీయ యువకుడు రాజ్ షమానీ ఒకరు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్ 2.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను దాటి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ పాడ్‌కాస్టర్‌గా గుర్తింపు పొందారు షమానీ. ఇప్పటివరకు పాడ్‌కాస్టింగ్ రంగంలో ఎంతో పేరు సంపాదించిన స్టీవెన్ బార్ట్‌లెట్, జో రోగన్ వంటి ప్రముఖులను కూడా ఆయన వెనక్కి నెట్టారు. దీంతో రాజ్ షమానీ పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.
24
వ్యాపారంతో మొదలుపెట్టి..
రాజ్ షమానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు వ్యాపారంపై ఆసక్తి ఉండేదట. 16 ఏళ్ల వయసులోనే షమానీ కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందట. తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే రూ.10 వేలతో డిష్‌వాష్ లిక్విడ్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారట. చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ వ్యాపారం క్రమంగా ఆయనకు ఎన్నో విషయాలు నేర్పించిందట.
వ్యాపారంలో కొంత అనుభవం వచ్చిన తర్వాత రాజ్ షమానీ మరో ఆలోచన చేశారట. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే వారి అనుభవాలు ఇతరులకు ఉపయోగపడతాయని భావించారట. ముఖ్యంగా యువతకు వ్యాపారం, డబ్బు సంపాదించడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలనే విషయాలు తెలియాలనుకున్నారట. ఈ ఆలోచనతోనే 2021లో ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ పేరుతో యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించారట.
34
ప్రముఖులతో ఇంటర్య్వూ
ఈ పాడ్‌కాస్ట్‌లో రాజ్ షమానీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తుంటారు. వారు జీవితంలో ఎలా ఎదిగారు? ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? వ్యాపారంలో ఎలా విజయం సాధించారు? డబ్బును ఎలా నిర్వహిస్తారు? వంటి విషయాలను అడిగి తెలుసుకుంటారు. అంతేకాదు, సాధారణంగా చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలను కూడా ఆయన బయటకు తీసుకొస్తారు. అందుకే ఆయన కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువత, ఉద్యోగాలు చేస్తున్నవారు, జీవితంలో ఎదగాలనుకునే వారికి ఈ పాడ్‌కాస్ట్ ఉపయోగకరంగా మారింది.
రాజ్ షమానీ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పేరున్న వ్యక్తులు కూడా అతిథులుగా వచ్చారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వంటి ప్రముఖులతో ఆయన మాట్లాడారు. వీరితో పాటు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ప్రముఖులతో మాట్లాడే అవకాశం రావడం, వారి అనుభవాలను ప్రజలకు అందించడం ఆయన పాడ్‌కాస్ట్‌కు మరింత గుర్తింపు తెచ్చింది.