Bengaluru: లాటరీ టికెట్ లావాదేవీ సెటిల్మెంట్ కోసం రూ. 5 లక్షలు డిమాండ్ చేసి, 4 లక్షలు తీసుకుంటుండగా కేపీ అగ్రహార ఇన్స్‌పెక్టర్ గోవిందరాజును లోకాయుక్త పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్ట్ సమయంలో హైడ్రామా చేసిన వీడియో వైరల్ గా మారింది.
కేపీ అగ్రహార ఇన్స్‌పెక్టర్ అరెస్ట్ : ఏసీపీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడ్డ గోవిందరాజు
బెంగళూరులోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ గోవిందరాజు, లాటరీ టికెట్ లావాదేవీ సెటిల్మెంట్ కు సంబంధించిన కేసులో లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒక వివాదాన్ని పరిష్కరించడానికి, నిందితులపై బడ్స్ యాక్ట్ (BUDS Act) కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆయన భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఈ ఘటన నగర పోలీసు విభాగంలో కలకలం రేపింది.
25
రూ. 5 లక్షల డీల్.. సీఏఆర్ గ్రౌండ్ వద్ద ట్రాప్
లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజు అందించిన సమాచారం ప్రకారం, ఇన్స్‌పెక్టర్ గోవిందరాజు బాధితుల నుండి మొత్తం రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 1 లక్ష నగదును ఆయన తీసుకున్నారు. మిగిలిన రూ. 4 లక్షలను చామరాజపేటలోని సీఏఆర్ గ్రౌండ్ వద్దకు తీసుకురావాలని సూచించారు. బాధితుడు ఈ విషయాన్ని లోకాయుక్తకు తెలపడంతో, అధికారులు పక్కా ప్లాన్ వేసి మాటు వేశారు.
35
సినిమా స్టైల్‌లో ప్రతిఘటన.. వీడియో వైరల్
గోవిందరాజు బాధితుడి నుంచి రూ. 4 లక్షలు తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. అయితే, పట్టుబడకుండా ఉండేందుకు ఇన్స్‌పెక్టర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆరుగురు అధికారులు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించగా, ఆయన గట్టిగా అరుస్తూ, ఆవేశంతో ఊగిపోయారు. సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ హైడ్రామాను చూసి స్థానికులు విస్తుపోయారు. చివరకు అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడు సూరజ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. "నన్ను ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించేవారు. ఈ కేసు నుండి బయటపడాలంటే ఏసీపీ చందన్ గారికి డబ్బులు ఇవ్వాలని గోవిందరాజు చెప్పేవారు. పోలీసులంటే న్యాయం చేస్తారని అనుకున్నాం, కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది" అని ఆయన ఆరోపించారు. మరో బాధితుడు మహమ్మద్ అక్బర్ ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగింది.
55
లోకాయుక్త పోలీసులు ఏం చెప్పారంటే?
ఈ దాడిపై లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజు స్పందిస్తూ.. "మేము అవినీతి నిరోధక చట్టం కింద ఈ ట్రాప్ నిర్వహించాం. గోవిందరాజు అనే ఇన్స్‌పెక్టర్ రూ. 5 లక్షలు డిమాండ్ చేసి, రూ. 4 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నాం" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇన్స్‌పెక్టర్ ను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.