Published : Jan 30, 2026, 06:57 PM ISTUpdated : Jan 30, 2026, 07:03 PM IST
Bengaluru : బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళపై పెంపుడు కుక్క కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెకు ముఖం, మెడపై 50కి పైగా కుట్లు పడ్డాయి.
పెంపుడు కుక్కదాడి.. మహిళకు 50 కుట్లు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పరిధిలోని టీచర్స్ కాలనీలో గణతంత్ర దినోత్సవం రోజున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6:54 గంటల సమయంలో ఒక మహిళ తన నివాసం సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తోంది. ఆ సమయంలో స్థానిక నివాసి అమరేష్ రెడ్డికి చెందిన పెంపుడు కుక్క ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడింది. ఆ కుక్క అత్యంత క్రూరంగా ఆమె మెడ, ముఖం, చేతులు, కాళ్లపై కరిచింది.
24
50కి పైగా కుట్లు.. ప్రాణాపాయం తప్పింది
కుక్క దాడి చేయడంతో ఆ మహిళ రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విని కాపాడటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా ఆ కుక్క దాడికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖం, మెడ భాగంలో గాయాలు చాలా లోతుగా ఉండటంతో వైద్యులు దాదాపు 50కి పైగా కుట్లు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, తీవ్రమైన గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి.
34
కుక్క యజమానిపై కేసు నమోదు
ఈ ఘటనపై బాధితురాలి భర్త హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెంపుడు కుక్క యజమాని అమరేష్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కను సరిగ్గా నియంత్రించకపోవడం, గొలుసు వాడకపోవడం వల్లే తన భార్యకు ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కేవలం బెంగళూరులోనే కాకుండా, గత గురువారం ఒక్కరోజే కర్ణాటక వ్యాప్తంగా ఆరు కుక్కల దాడులు వెలుగుచూశాయి. బెళగావిలో ఒక వృద్ధుడిపై, బెంగళూరు సౌత్‌లో ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. అలాగే కలబురగిలో నలుగురు పాఠశాల విద్యార్థినులు కుక్క కాటుకు గురయ్యారు. ఈ వరుస ఘటనలు పెంపుడు జంతువుల నిర్వహణ, వీధి కుక్కల నియంత్రణపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత కోసం కఠినమైన నిబంధనలు అమలు చేయాలని జనం కోరుతున్నారు.