జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ హర్వాన్–లద్వాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఎన్‌కౌంటర్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో పహల్గామ్ దాడిలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. TRF ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఈ దాడికి కారణమైన ఉగ్రవాదుల కోసం భారత భద్రతా దళాలు ముమ్మర వేట ప్రారంభించాయి. అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
24
‘ఆపరేషన్ మహదేవ్’లో ఉగ్రవాదుల ముట్టడి
పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందిచాలనే లక్ష్యంతో ఆర్మీ బలగాలు వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం కొంతమంది అందించిన సమాచారం ఆధారంగా శ్రీనగర్ లిద్వాస్ దగ్గర మౌంట్ మహదేవ్ సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు గుర్తించారు.
వెంటనే భద్రతా బలగాలు ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉదయం 11 గంటలకు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ దాడిలో ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా అనే ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. వీరిపై ఒక్కొక్కరికి రూ. 20 లక్షల రివార్డు ఉంది.
34
పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సింధూర్’ చర్చకు ముందు కీలక పరిణామం
ఇదిలా ఉంటే సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో పహల్గామ్ దాడి, ‘ఆపరేషన్ సింధూర్’ పై చర్చ జరుగుతున్న సమయంలోనే శ్రీనగర్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఘటనపై ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు ఈ ఆపరేషన్ సమాధానంగా నిలిచిందని బీజేపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
భద్రతా బలగాలు ప్రస్తుతం హర్వాన్, ములనార్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మిగతా ఉగ్రవాదులు అక్కడే దాక్కున్నారా అనే అనుమానంతో అదనపు బలగాలను మోహరించారు. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.