Nainar Nagendran
2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ తమిళ పాలిటిక్స్ పై కన్నేసింది. అందులో భాగంగానే ఇప్పటివరకు రాాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పనిచేసిన అన్నామలైని తప్పించి కొత్తగా నయనార్ నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ పగ్గాలు అప్పగించారు.
ఇప్పటికే బీజేపీ, అన్నాడిఎంకే కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేను దగ్గరకు తీసుకోవడం కోసమే బీజేపీ అధ్యక్ష పదవిలో మార్పులకు జాతీయ నాయకత్వం శ్రీకారం చుట్టింది.
Nainar Nagendran
హేమాహేమీలను కాదు నయనార్ కే అధ్యక్ష పీఠం..
అన్నాడీఎంకేతో పొత్తు చర్చలకు ఆటంకం కలగకూడదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిని మార్చినట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. అందుకే దూకుడుగా ఉండే అన్నామలైని తప్పించి నయనార్ నాగేంద్రన్ అధ్యక్షుడిని చేసారు. ఈరోజు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకుని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తమిళనాడుకు చెందిన బిజెపి హేమాహేమీలు తమిళిసై సౌందరరాజన్, ఆనందన్ అయ్యసామి, వనతి శ్రీనివాసన్, కరుప్పు మురుగానందం, శరత్‌కుమార్ వంటి వారు రేసులో ఉన్నప్పటికీ, వీరందరినీ దాటి నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Nainar Nagendran
అన్నాడీఎంకేలో నయనార్ నాగేంద్రన్
2001-2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా నయనార్ పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండకూడదని అన్నాడీఎంకే షరతు పెట్టినట్లు సమాచారం. దీంతో అన్నాడీఎంకేతో సఖ్యతగా ఉండే వ్యక్తిని బీజేపీ అధ్యక్ష పదవిలో నియమించాలని జాతీయ నాయకత్వం భావించింది. నయనార్ నాగేంద్రన్ సరైన వ్యక్తి అని జాతీయ నాయకత్వం భావించింది.
నయనార్ నాగేంద్రన్‌కు ఆ పార్టీలోని నాయకులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితో మధురంగా ఉండే నయనార్ నాగేంద్రన్ దూకుడు రాజకీయాల్లో పాల్గొనే వ్యక్తి కాదు. ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శించరు. అందుకే ఆయనను బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసింది.
Nainar Nagendran
నాగేంద్రన్ ఎంకకు ఇదే మెయిన్ రీజన్ :
నయనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో పొత్తు చర్చలు జరిపి అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీలను కూటమిలోకి తీసుకురావాలని బీజేపీ భావించింది. ఇది కాకుండా నయనార్ నాగేంద్రన్ బీజేపీ అధ్యక్షుడిగా కావడానికి మరో ముఖ్య కారణం ఉంది. బీజేపి కన్యాకుమారి ప్రాంతంలో బలంగా ఉన్నప్పటికీ ఇతర దక్షిణ జిల్లాల్లో అంత బలం లేదు.
ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో గణనీయంగా ఉన్న దేవార్, నాడార్ సామాజిక వర్గాల ఓట్లు బీజేపీకి ఎక్కువగా లేవు. దీంతో ఆ ఓట్లను దృష్టిలో ఉంచుకుని దక్షిణ జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు నయనార్ నాగేంద్రన్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓపీఎస్, టీటీవీ దినకరన్ వంటి వారు అన్నాడీఎంకే నుంచి విడిపోయి ఉండటంతో దేవార్ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి డీఎంకేకు ఎక్కువగా వెళ్తున్నాయి.
ఈ ఓట్లన్నింటినీ కలిపి బీజేపీకి వచ్చేలా అదే సామాజిక వర్గానికి చెందిన నయనార్ నాగేంద్రన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. నయనార్ నాగేంద్రన్‌కు దక్షిణ జిల్లాల్లో మంచి పలుకుబడి ఉంది. ఏ శుభకార్యం ఉన్నా, సంతాప కార్యక్రమం ఉన్నా, గుడిలో ప్రత్యేక పూజలు ఉన్నా అక్కడ ప్రజలతో కలిసి ఉండటం ఆయనకు అలవాటు
Nainar Nagendran
బీజేపీని బలంగా నిలబెడతారా?
దక్షిణ జిల్లాల ప్రజలకు బాగా తెలిసిన నాయకుడు కాబట్టి ప్రజల మనస్సులో బీజేపీని బలంగా నాటగలరనే ఉద్దేశంతో నయనార్ నాగేంద్రన్‌కు పెద్ద బాధ్యతలు వచ్చాయి. మరి బీజేపీ నాయకత్వం అనుకున్నట్లు తమిళనాడులో బీజేపీని బలంగా నిలబెడతారా? వేచి చూడాలి.