Modi Putin Meeting: భారత్ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం ఆర్థిక దృక్కోణంలో కీలకమైంది. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు దిగుమతులు కొనసాగుతున్న నేపథ్యంలో, రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత దెబ్బతింది. దీన్ని తగ్గించేందుకు భారత్.. రష్యా మార్కెట్‌లో తమ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తోంది. ముఖ్యంగా మందులు, ఆటోమొబైల్ ఉత్పత్తులు, వ్యవసాయ సరుకులు, సముద్ర ఉత్పత్తులు రష్యా మార్కెట్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.
25
100 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యంగా..
ఈ భేటీలో రెండు దేశాలూ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ప్రకటించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం పెట్టుకున్నారు. రష్యా నుంచి వచ్చిన వ్యాపార బృందం కూడా ఐరోపా దేశాలపై ఆధారపడకుండా, నమ్మకమైన భారత మార్కెట్‌తో గట్టి వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. భారత్ నుంచి ఎగుమతులు పెరిగితే రెండు దేశాలకూ లాభం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తమైంది.
35
రక్షణ రంగంలో భారీ చర్చలు
భారత్–రష్యా సంబంధాల్లో రక్షణ సహకారం కూడా ఎప్పటి నుంచో కీలక స్థాయిలో ఉంది. ఈ సమావేశం ఆ రంగాన్ని మరింత బలపరిచింది. మరో ఐదు S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసే అవకాశంపై చర్చ సాగింది. భారత నావికాదళానికి అణుశక్తితో నడిచే జలాంతర్గామిని దీర్ఘకాల లీజుపై తీసుకునే ఒప్పందం కూడా ముందుకు వచ్చింది. రెండు దేశాల సైనిక కదలికలకు లాజిస్టికల్ సపోర్ట్ అందించేందుకు Relos ఒప్పందానికి రష్యా సానుకూలంగా స్పందించింది. ఈ నిర్ణయాలు రాబోయే దశాబ్దంలో భారత రక్షణ వ్యవస్థకు కొత్త బలం ఇవ్వనున్నాయి.
ఈ భేటీ కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశం చర్చనీయాంశంగా మారింది. రష్యా ఉక్రెయిన్ వివాదం కారణంగా ఒంటరిగా మారలేదని, శక్తివంతమైన భారత్ తమతో ఉందని ప్రపంచానికి తెలియజేసింది. భారత్ కూడా ఏ బాహ్య ఒత్తిడికైనా లోబడకుండా, జాతీయ భద్రతకు అవసరమైన సంబంధాలను స్వతంత్రంగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ సందేశం ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు స్పష్టంగా చేరింది.
55
భవిష్యత్ అంతర్జాతీయ సమీకరణపై ప్రభావం
మోదీ–పుతిన్ భేటీ భారత విదేశాంగ విధానానికి కొత్త దిశను ఇచ్చినట్లు విశ్లేషకుల అభిప్రాయం. రానున్న రోజుల్లో భారత్–రష్యా ఆర్థిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు లేదా ఇతర ఒత్తిళ్లు ఉన్నా, భారత్ స్వంత ప్రయోజనాలను కాపాడుకునే దిశగా నడుస్తున్నట్లు ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉంటే మోదీ, పుతిన్‌ల భేటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.