Modi Cabinet Decisions: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రూ. 77,101 కోట్ల విలువైన 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ఎరువుల సబ్సిడీ, నోయిడా మెట్రో విస్తరణ సహా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
సామాన్యులు, రైతులకు గుడ్ న్యూస్: ముద్రా లోన్లు, ఎరువుల సబ్సిడీపై కేంద్రం సంచలన నిర్ణయం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారుల కోసం 5 ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటి కోసం మొత్తం రూ. 77,101 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ నిర్ణయాలతో దేశ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగం, చిన్న పరిశ్రమలకు కొత్త బలం చేకూరనుంది.
26
ప్రపంచంలోనే అతిపెద్ద యుగే యుగీన్ భారత్ మ్యూజియం
భారతదేశ గొప్ప చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచానికి చూపించేందుకు ఢిల్లీలో భారీ మ్యూజియం నిర్మించనున్నారు. చరిత్రాత్మక నార్త్, సౌత్ బ్లాక్‌లలో 'యుగే యుగీన్ భారత్ మ్యూజియం' పేరుతో దీనిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం రూ. 3,230 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ మ్యూజియం మొదటి గ్యాలరీని 2027లో సామాన్య ప్రజల కోసం ఓపెన్ చేస్తారు. ఇక్కడికి ఏటా కోటి మంది పర్యాటకులు వస్తారని కేంద్రం అంచనా వేస్తోంది.
36
రైతులకు రూ. 62,370 కోట్ల ఎరువుల సబ్సిడీ
రబీ సీజన్ (అక్టోబర్ నుంచి మార్చి) నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం రైతులకు భారీ ఊరటనిచ్చింది. ఎరువుల సబ్సిడీ కింద రూ. 62,370 కోట్లను కేబినెట్ ఆమోదించింది. పోషక ఆధారిత సబ్సిడీ విధానం కింద రైతులకు తక్కువ ధరలకే ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులను అందిస్తారు. దీనివల్ల సాగు ఖర్చు తగ్గి అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది.
చిన్న వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేబినెట్ కీలక అడుగు వేసింది. మైక్రో యూనిట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్ ద్వారా ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 12.6 లక్షల కోట్ల వరకు ఇచ్చే రుణాలకు గ్యారెంటీ లభిస్తుంది. దీనివల్ల బ్యాంకులు చిన్న వ్యాపారులకు సులభంగా లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.
56
స్టాండ్ అప్ ఇండియా పథకానికి కొత్త బలం
స్వయం ఉపాధి, కొత్తగా వ్యాపారం ప్రారంభించే ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే 'స్టాండ్ అప్ ఇండియా' పథకానికి కేబినెట్ ఊతమిచ్చింది. ఈ స్కీమ్ కోసం రూ. 4,111 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను మంజూరు చేసింది. దీనివల్ల కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి, తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి సంస్థాగత రుణాలు ఈజీగా దొరుకుతాయి.
66
నోయిడా-గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ
నోయిడా ఆక్వా లైన్ మెట్రో రైలు కారిడార్ విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కింద నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 మధ్య 8.449 కిలోమీటర్ల మేర కొత్త లైన్ వేస్తారు. ఇందులో 5 కొత్త మెట్రో స్టేషన్లు నిర్మిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం రూ. 2,390 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ లైన్ అందుబాటులోకి వస్తే రెండు నగరాల్లోని మొత్తం మెట్రో నెట్వర్క్ 71.878 కిలోమీటర్లకు చేరుకుంటుంది. దీనివల్ల గౌర్ సిటీ మాల్, బ్లూ సఫైర్ మాల్, ఐకియా, టెక్ మహీంద్రా వంటి పెద్ద కమర్షియల్, ఆఫీస్ హబ్‌లకు డైరెక్ట్ కనెక్టివిటీ లభిస్తుంది. రోడ్లపై ట్రాఫిక్ తగ్గి, రోజువారీ ప్రయాణికులకు జర్నీ చాలా ఈజీ అవుతుంది.