ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ డేటా సెంట‌ర్‌.. రూ.570 కోట్ల పెట్టుబడి, 2,565 మందికి ఉద్యోగాలు

Published : Nov 10, 2026, 05:05 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల విస్తరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్ర‌బాబు అధ్యక్షతన ఈ స‌మావేశం జ‌రిగింది.

PREV
14
ఏవీజీసీ, రోబోటిక్స్ రంగాలకు కొత్త పాలసీలు

రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 2026–2031 కాలానికి సంబంధించిన ఏపీ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం. అలాగే 2036 వరకు అమల్లో ఉండే రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీకి కూడా ఆమోదం లభించింది. సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో మార్పులు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. భవిష్యత్తులో డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ఏపీని కీలక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయాలు దోహదపడనున్నాయి.

24
భారీ పెట్టుబడులతో డేటా సెంటర్లు, పరిశ్రమలు

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే పలు ప్రాజెక్టులపై క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనాంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రూ.31,387 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఈప్యాక్ సంస్థ రూ.570.20 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,565 మందికి ఉపాధి కల్పించనున్నారు. తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు భూముల కేటాయింపు ప్రతిపాదనను కూడా పరిశీలించి ముందుకు తీసుకెళ్లారు. ఈ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నాయుడుపేటలో లిథియం బ్యాటరీ తయారీకి అవసరమైన మెటీరియల్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుపైనా చర్చ జరిగింది. కార్బన్ కాస్మో సంస్థ రూ.4 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అదానీ గ్రూపు ప్రతిపాదించిన క్లౌడ్ హబ్‌పైనా ఐటీ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్చించారు.

34
మహిళా పారిశ్రామికవేత్తలు, కొత్త పారిశ్రామిక పార్కులకు ప్రోత్సాహం

పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల పాదరక్షల తయారీకి అవసరమైన విడిభాగాల పరిశ్రమలకు అవకాశాలు పెరగనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల్లో ఎఫ్‌ఎల్‌వో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకరా రూ.35.31 లక్షల చొప్పున భూములు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. హెటెరో గ్రూపునకు బల్క్ డ్రగ్ పార్కులో భూముల కేటాయింపు అంశం కూడా క్యాబినెట్ పరిశీలనకు వచ్చింది. వివిధ జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు పలు ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

44
పోలీస్ శాఖలో ప్రత్యేక రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఏపీ పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కొత్త విభాగం పనిచేయనుంది. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతకు సంబంధించిన చర్యలను సమన్వయం చేయడం దీని ప్రధాన బాధ్యతగా ఉండనుంది.

మరోవైపు టీటీడీలో ప్రధాన సన్నిధి యాదవ, అదనపు సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా చర్చించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ల సాంకేతికతతో రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని కూడా మంత్రివర్గం పరిశీలించింది. ఈ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే అవకాశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

కూటమి విజయంపై హర్షం.. మంత్రులకు చంద్రబాబు సూచనలు

మంత్రివర్గ సమావేశానికి ముందు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి సమావేశ మందిరంలోకి ప్రవేశించగా మంత్రులంతా లేచి నిలబడి అభినందనలు తెలిపారు. చప్పట్లతో సమావేశ ప్రాంగణం మార్మోగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా పరస్పరం కరచాలనం చేసుకుంటూ ఉత్సాహంగా సమావేశానికి హాజరయ్యారు.

అయితే ఈ విజయంతో అతిగా సంబరపడకుండా మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి విజయగర్వం తలకెక్కించుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి మంత్రి, ప్రజాప్రతినిధి పనిచేయాలని చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజలకు మరింత చేరువ కావాలని దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories