టీవీ రంగంలో ఉద్యోగాలకు ముప్పు త‌ప్ప‌దా.. అదే జ‌రిగితే వేల మందిపై ప్రభావం

Published : Nov 03, 2026, 04:01 PM IST

Jobs: టీవీ మీడియా రంగంలో ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. టెలివిజన్ ఛానళ్ల రేటింగ్స్‌ను వెల్లడించే బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) మూతపడే పరిస్థితి వస్తే సుమారు 1,500 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

PREV
15
BARC మూతపడితే 1,500 మందికి ఉద్యోగ గండం

టీవీ ఛానళ్ల ప్రేక్షకుల సంఖ్యను లెక్కించి రేటింగ్స్ ప్రకటించే సంస్థే BARC ఇండియా. ఈ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోతే దాని పరిధిలో పనిచేస్తున్న సుమారు 1,500 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందులో రేటింగ్స్ సేకరణ, సమాచార విశ్లేషణ, సాంకేతిక విభాగాలు, ఇతర అనుబంధ సేవల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. అయితే BARC మూతపడే పరిస్థితి ఇంకా చర్చల దశలోనే ఉంది. ఇది ఒకవైపు ఉండగా, మరోవైపు ప్రముఖ టీవీ నెట్‌వర్క్‌లు కూడా తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పరిణామాలు వేర్వేరుగా చోటుచేసుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ e4mExclusive ప్రత్యేక కథనంలో ప్రచురించింది.

25
దీపావళి తర్వాత టీవీ ఛానళ్లలో తొలగింపులు?

టీవీ రేటింగ్స్ నిలిచిపోవడంతో ఛానళ్ల ఆదాయంపై ప్రభావం పడుతోంది. ఏ ఛానల్‌కు ఎంత మంది ప్రేక్షకులు ఉన్నారు? ఏ కార్యక్రమానికి ఎక్కువ ఆదరణ లభిస్తోంది? ఏ సమయంలో ప్రకటనలు ఇస్తే ఎక్కువ మందికి చేరుతాయి? అనే వివరాలు తెలియకపోవడంతో ప్రకటనల వ్యాపారం కష్టంగా మారింది. సాధారణంగా ఛానళ్లకు వచ్చే ఆదాయంలో ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రేటింగ్స్ లేకపోవడంతో ప్రకటనదారులకు తమ ఛానళ్ల ప్రేక్షకుల సంఖ్యను నిరూపించడం కష్టమవుతోంది. దీంతో ప్రకటనల ధరల విషయంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు టీవీ నెట్‌వర్క్‌లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీపావళి తర్వాత ఎడిటోరియల్, ప్రోగ్రామింగ్, సేల్స్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి విభాగాల్లో ఉద్యోగుల కోతలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

35
ఆదాయం లేక ఇబ్బందుల్లో BARC

రేటింగ్స్ నిలిచిపోవడంతో BARC కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సాధారణంగా టీవీ బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సబ్‌స్క్రైబర్ల నుంచి వసూలు చేసే చందాలే ఈ సంస్థకు ప్రధాన ఆదాయ మార్గాల్లో ఒకటి. అయితే రేటింగ్స్ నిలిపివేసిన సమయంలో న్యూస్ ఛానళ్ల నుంచి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయకూడదని జూన్‌లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ఆదేశించింది. ప్రేక్షకుల రేటింగ్స్ అందుబాటులో లేనప్పుడు ఛానళ్లు సేవలకు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదన్నది మంత్రిత్వ శాఖ అభిప్రాయం.

దీనిపై BARC అభ్యంతరం వ్యక్తం చేసింది. రేటింగ్స్ ప్రకటించకపోయినా సంస్థ నిర్వహణ ఖర్చులు మాత్రం ఆగవని మంత్రిత్వ శాఖకు తెలిపింది. ఇళ్లలో ఏర్పాటు చేసిన మీటర్ల నిర్వహణ, ప్రేక్షకుల వీక్షణ వివరాల సేకరణ, డేటా విశ్లేషణ, సాంకేతిక వ్యవస్థల నిర్వహణకు భారీగా ఖర్చవుతోందని వివరించింది. బిల్లింగ్‌పై ఉన్న ఆంక్షలను తొలగించాలని కూడా కోరింది. మరోవైపు, న్యూస్ ఛానళ్లకు సంబంధించిన చందాల వసూలు నిలిచిపోగా, ఇతర సబ్‌స్క్రైబర్లలోనూ కొద్దిమంది ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లు మాత్రమే చెల్లింపులు కొనసాగిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

45
BARCకు నవంబర్ వరకు గడువు.. కొత్త నిబంధనలివే

టీవీ రేటింగ్స్ తిరిగి ప్రారంభించేందుకు నవంబర్‌ను కీలక గడువుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. కొత్త టెలివిజన్ రేటింగ్స్ పాలసీ-2026 ప్రకారం అవసరమైన మార్పులు చేసి అనుమతి పొందేందుకు BARCకు నవంబర్ వరకు సమయం ఇచ్చినట్లు సమాచారం.

కొత్త విధానం ప్రకారం BARC పలు మార్పులు చేయాల్సి ఉంది. వీటిలో ప్ర‌ధానంగా.

* ప్రస్తుతం ఉన్న మీటర్లతో కూడిన ఇళ్ల సంఖ్యను 80 వేల వరకు పెంచాలి.

* సంస్థ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించాలి.

* ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించాలి.

* వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి ప్రేక్షకుల వీక్షణను కొలవాలి.

* ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ల్యాండింగ్ పేజీ వీక్షణలను అధికారిక రేటింగ్స్‌లో లెక్కించకూడదు.

ఈ నిబంధనల్లో భాగంగా ఇప్పటికే తమ ప్యానెల్‌ను 70,876 ఇళ్లకు పెంచినట్లు BARC మంత్రిత్వ శాఖకు తెలిపింది. డిసెంబర్ నాటికి 80 వేల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడించింది. అయినప్పటికీ రేటింగ్స్‌ను తిరిగి ప్రకటించేందుకు అవసరమైన అనుమతి ఇంకా లభించలేదు.

55
BARC భవిష్యత్తుపై బ్రాడ్‌కాస్టర్ల చర్చలు

రేటింగ్స్ నిలిచిపోవడంతో టీవీ పరిశ్రమలో అనిశ్చితి పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే BARC కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలనే అంశాన్ని కూడా పరిశ్రమ వర్గాలు చివరి మార్గంగా పరిశీలిస్తున్నాయి. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (IBDF) బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రేటింగ్స్ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టమైన గడువు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించే ఆలోచనలో పరిశ్రమ ఉంది.

మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరుగుతుండటంతో సంప్రదాయ టెలివిజన్ ఛానళ్లకు ఇప్పటికే పోటీ ఎక్కువైంది. ఇప్పుడు రేటింగ్స్ నిలిచిపోవడం వాటి ఆదాయంపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించకపోతే BARC పరిధిలోని ఉద్యోగులతో పాటు వివిధ టీవీ నెట్‌వర్క్‌లలో పనిచేసే సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తంగా రేటింగ్స్ పునఃప్రారంభంపై తీసుకునే నిర్ణయం టీవీ పరిశ్రమ భవిష్యత్తుతో పాటు వేలాది మంది ఉద్యోగుల ఉపాధిని ప్రభావితం చేయనుంది.

Read more Photos on
click me!

Recommended Stories