India Bullet Train: భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే 'మేడ్ ఇన్ ఇండియా' (B35) స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
భారతదేశం కేవలం బుల్లెట్ ట్రైన్‌ను నడపడమే కాకుండా, సొంతంగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలో బుల్లెట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దీనికి తోడు 'మేడ్ ఇన్ ఇండియా' ముద్రతో స్వదేశీ బుల్లెట్ ట్రైన్‌ను రూపొందించేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. 2030 సంవత్సరం నాటికి ఈ స్వదేశీ బుల్లెట్ ట్రైన్ల తయారీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ క్యాబినెట్ ప్రతిపాదన ప్రకారం ఈ పనులు వేగవంతం అయ్యాయి.
25
2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు
ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ ట్రైన్ నడవనుంది. ఈ ప్రాజెక్ట్‌ను రెండు విడతల్లో అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ప్రస్తుతం ఈ రూట్‌కు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ ట్రాక్‌పై B28 సిరీస్‌కు చెందిన హై-స్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
35
గంటకు 350 కిమీ వేగం.. జపాన్‌కు పోటీ
భారత్ తయారు చేయబోయే B35 మోడల్ స్వదేశీ బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇది జపాన్‌కు చెందిన E10 సిరీస్ బుల్లెట్ ట్రైన్‌కు నేరుగా పోటీ ఇవ్వనుంది. జపాన్ ప్రస్తుతం తన E5 సిరీస్ ట్రైన్ల తయారీని ప్రాసెస్ వారీగా నిలిపివేస్తోంది. వాటి స్థానంలో E10 సిరీస్ ట్రైన్ల ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. జపాన్ 2030లో E10 తయారీ ప్రారంభించి, 2034 నాటికి పట్టాలెక్కించాలని చూస్తోంది. అదే సమయంలో భారత్ కూడా తన స్వదేశీ సాంకేతికతతో రంగంలోకి దిగుతోంది.
దేశంలో B28 హై-స్పీడ్ రైళ్ల తయారీ ఇప్పటికే ప్రారంభమైంది. బిఈఎంఎల్ (BEML) సంస్థకు 32 B28 ట్రైన్లను తయారు చేసే కాంట్రాక్ట్ లభించింది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో మొదట ఈ రైళ్లే తిరుగుతాయి. ఈ B28 ట్రైన్ గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు కాగా, ఆపరేషనల్ వేగం గంటకు 249 కిలోమీటర్లుగా ఉంటుంది. భారత్ కేవలం రైళ్లను మాత్రమే కాకుండా, వాటికి కావలసిన కంట్రోలింగ్ సిస్టమ్‌ను కూడా సొంతంగానే డెవలప్ చేస్తోంది.
55
ప్రాజెక్ట్ ఆలస్యం.. ప్రస్తుత పరిస్థితి ఇదే
నిజానికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ 2015లో ప్రారంభమైంది. అయితే భూసేకరణ సమస్యలు, టర్బైన్ యంత్రాల సరఫరాలో ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ నిర్ణీత గడువు కంటే చాలా వెనుకబడింది. అనుకున్న బడ్జెట్ కంటే వ్యయం రెట్టింపు అయింది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం భారత్ సొంతంగా తయారు చేసే బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌పై భారతీయ రైళ్లే పరిగెత్తనున్నాయి.