సామాన్యులకు మరో షాక్ తప్పేలా లేదు. త్వరలోనే ఎంఆర్‌ఐ స్కాన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం 'హీలియం' గ్యాస్ కొరతే. దీనివల్ల MRI స్కానింగ్ తో పాటు మరెన్నో వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత కొనసాగుతోంది. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మరో కొత్త సమస్య మొదలయ్యింది... ఇప్పుడు ఈ జాబితాలో హీలియం గ్యాస్ కూడా చేరింది. పార్టీలు, ఫంక్షన్లలో బెలూన్లలో నింపడానికే కాదు.. ఎంఆర్‌ఐ స్కానింగ్, సెమీకండక్టర్ల తయారీ, ఏరోస్పేస్, ఫైబర్ ఆప్టిక్స్ వంటి కీలక రంగాల్లో ఈ గ్యాస్‌ను వాడతారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల దీని సరఫరా వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది.
25
ఎందుకు హీలియం లభించడంలేదు..?
ప్రపంచంలో హీలియం ఉత్పత్తిలో ఖతార్ మొదటి స్థానంలో ఉంది. అలాంటి ఖతార్‌లోని 'రాస్ లఫాన్' ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడితో హీలియం సరఫరాలో మూడింట ఒక వంతు నిలిచిపోయింది. దీనికి తోడు, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో సరఫరా మరింత పడిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతను ప్రమాదకర స్థాయికి చేర్చింది.
35
హిలియం ఉపయోగమేంటి..?
అలంకరణ కోసం బెలూన్లు, ప్రకటనల కోసం వాడే బ్లింప్‌లు, పెరేడ్ ఫ్లోట్‌లలో హీలియం నింపుతారు. ఇంట్లో వాడే ఉపకరణాల్లో చిన్న లీక్‌లను గుర్తించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇక వైద్య రంగంలో దీని పాత్ర చాలా పెద్దది. ఎంఆర్‌ఐ స్కానింగ్ మెషీన్లను చల్లగా ఉంచడానికి హీలియం అత్యవసరం. స్కానింగ్ మెషీన్‌లోని సూపర్ కండక్టింగ్ మాగ్నెట్‌లు పనిచేయాలంటే, వాటిని -269 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచాలి.
సెమీకండక్టర్, ఫైబర్ ఆప్టిక్స్ తయారీలో కూడా హీలియం వాడతారు. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించి, ఇతర భాగాలను చల్లగా ఉంచగల ప్రత్యేక గుణం దీనికి ఉంది. మైక్రోచిప్‌ల ఉత్పత్తి సమయంలో రసాయన కాలుష్యాన్ని నివారించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఏరోస్పేస్ రంగంలో రాకెట్ ఇంధన ట్యాంకులను శుభ్రపరచడానికి, ఒత్తిడిని పెంచడానికి హీలియం కచ్చితంగా కావాలి. ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్ వంటి అత్యంత శీతల ఉష్ణోగ్రతల్లోనూ ఇది వాయు రూపంలోనే ఉంటుంది.
55
హీలియం కొరత
భూమిపై హీలియం చాలా అరుదుగా లభిస్తుంది. దీన్ని వాతావరణం నుంచి తీయలేం; ఇది భూమి పొరల్లో మాత్రమే దొరుకుతుంది. ఒకసారి గాలిలోకి విడుదలైతే, అది శాశ్వతంగా అంతరించిపోతుంది. హీలియం కొరత కారణంగా రాబోయే రోజుల్లో ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ రంగాల్లో ఖర్చులు ఆకాశాన్నంటడం ఖాయం.