పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్

Published : Sep 26, 2026, 06:08 PM IST

Gold Smuggling: అధికారులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా అక్ర‌మ ర‌వాణా మాత్రం ఆగ‌డం లేదు. ర‌క‌ర‌కాల మార్గాల్లో బంగారాన్ని ఇత‌ర దేశాల నుంచి భార‌త‌దేశానికి తీసుకొస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ముంబైలో విస్తుపోయే విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది.

PREV
15
భారీగా బంగారం అక్ర‌మ ర‌వ‌ణా

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ బంగారం అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. సాధారణంగా ఇంట్లో వంటకు ఉపయోగించే ఆహార పదార్థాల రూపంలో బంగారాన్ని దాచిపెట్టి తరలించిన ఘటన కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఈ అక్రమ రవాణాను గుర్తించారు. ఇడ్లీ రవ్వ, రాగి పిండి, కార్న్‌ఫ్లోర్, పాల పొడి, ఓట్స్, బియ్యపు పిండి, నుటెల్లా, కొబ్బరి పాల పొడి, కేక్ మిక్స్ వంటి పదార్థాల్లో బంగారాన్ని కలిపి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

25
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు

సెప్టెంబర్ 23 తెల్లవారుజామున దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులపై డీఆర్ఐ అధికారులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో ముంబై జోనల్ యూనిట్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీని పరిశీలించిన సమయంలో సాధారణంగా కనిపించే ఆహార పదార్థాల ప్యాకెట్లపై అనుమానం కలిగింది. వాటిని తెరిచి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. బయటికి చూస్తే పిండి, పొడి పదార్థాల్లా కనిపించినప్పటికీ వాటిలో విలువైన లోహం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

35
ఆహార పదార్థాల మధ్య బంగారాన్ని కలిపి

ఈ స్మగ్లింగ్‌లో ఉపయోగించిన పద్ధతి అధికారులను కూడా షాక్‌కి గురి చేసింది. బంగారాన్ని చిన్న ముక్కలుగా లేదా ఆభరణాల రూపంలో కాకుండా అత్యంత మెత్తటి పొడి రూపంలోకి మార్చి ఆహార పదార్థాల్లో కలిపినట్లు గుర్తించారు. ఇడ్లీ రవ్వ, రాగి పిండి, కార్న్‌ఫ్లోర్, పాల పొడి, ఓట్స్, బియ్యపు పిండి వంటి పదార్థాలతో పాటు న్యుటెల్లా, కొబ్బరి పాల పొడి, కేక్ మిక్స్‌లోనూ ఈ మిశ్రమాన్ని దాచారు. మొత్తం 33.50 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని విడిగా పరిశీలించారు. ప్రత్యేక పరీక్షల అనంతరం ఆ మిశ్రమంలో 24 క్యారెట్ల బంగారం ఉన్నట్లు నిర్ధారించారు.

45
9.40 కిలోల బంగారం.. విలువ రూ.14.81 కోట్లు

అధికారుల వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న మిశ్రమాల నుంచి మొత్తం 9.40 కిలోల విదేశీ బంగారాన్ని వెలికితీశారు. ఇది 24 క్యారెట్ల బంగారం కాగా, దాని స్వచ్ఛత 99.99 శాతంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.14.81 కోట్లుగా అధికారులు వెల్లడించారు. గతంలో బంగారాన్ని దుస్తులు, షూస్, లగేజీ భాగాలు, ఇతర వస్తువుల్లో దాచిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఇది పూర్తిగా భిన్నంగా ఉండ‌డం అధికారుల‌ను సైతం విస్తుపోయేలా చేసింది.

55
ముగ్గురి అరెస్ట్.. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు

ఈ వ్యవహారంలో పట్టుబడిన ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ చట్టం-1962 కింద అధికారులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వీరికి ఒక వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ముంబైలో ఎవరికి అప్పగించాల్సి ఉంది? ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు? గతంలోనూ ఇదే తరహాలో బంగారాన్ని తరలించారా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories